Andhra Pradesh: రాజన్న ఎప్పుడూ ఇలాంటి పాలన చేయలేదు: సీఎం జగన్ పై కన్నా విమర్శలు

  • రాజన్నది ప్రజాపాలన..పోలీస్ పాలన కాదు
  • ప్రజల మనసుల్లో రాజన్న నాయకుడిగా నిలిచారు
  • ‘రాజన్న పాలన’ అంటూ ఇప్పుడు పోలీస్ పాలన చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ పాలనా తీరుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. కాకినాడలో ఈరోజు జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం రెండు నెలల్లోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. ఇసుకపై ప్రభుత్వ వైఖరి భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసేలా చేసిందని, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ మరో జన్మభూమి కమిటీ లాంటిదేనని, ఈ వ్యవస్థ ద్వారా అరాచకాలు జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన గురించి ఆయన ప్రస్తావించారు. రాజన్న ఎప్పుడూ ఇలాంటి పాలన చేయలేదని అన్నారు. రాజన్న ఎప్పుడూ పోలీస్ పాలన చేయలేదని, ప్రజాపాలనే చేశారని చెప్పారు. మంచి పనులు చేసి ప్రజల మనసుల్లో నాయకుడిగా రాజన్న నిలిచారని, రాజన్న పాలన పేరు చెప్పి ఇప్పుడు పోలీస్ పాలన చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరునూ ఆయన ఎండగట్టారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభలో వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని విమర్శించారు.

More Telugu News