IMD: ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు.. కూలిన 133 భవనాలు.. 15 మంది మృత్యువాత

  • మూడు రోజులుగా ఎడతెరిపి లేని వానలు
  • నేటి నుంచి మరో ఐదు రోజులపాటు భారీ వర్ష సూచన
  • అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక

నిన్నమొన్నటి వరకు ముంబైని వణికించిన వర్షాలు ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 133 భవనాలు నేల కూలగా, 15 మంది ప్రాణాలు కోల్పోయారు. నేటి నుంచి మరో ఐదు రోజులపాటు యూపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్‌తోపాటు ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటక, గోవా, కొంకణ తీర ప్రాంతం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరంలలో కూడా నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

More Telugu News