Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కొత్త టెక్నాలజీ... ముఖాన్ని చూపించి లోపలికి వెళుతున్న చిరంజీవి, నాగార్జున, చరణ్, అఖిల్!

  • ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఏర్పాటు
  • నమోదు చేయించుకున్న పలువురు ప్రముఖులు
  • సులువుగా ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లేందుకు వీలు

హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ కు వీఐపీలు, ప్రముఖులు, సెలబ్రిటీల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకూ 1300 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. రెగ్యులర్ గా ప్రయాణాలు చేసే వారు ఒకసారి తమ వివరాలు నమోదు చేసుకుంటే, ఆపై సెకన్ల వ్యవధిలోనే ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లే అవకాశాలుంటాయి.

సినీ నటుల్లో చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, అఖిల్ తదితరులతో పాటు పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు తమ వివరాలను నమోదు చేసుకుని, క్యూలైన్లలో నిలిచే సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. ఒకసారి గుర్తింపు కార్డు, మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ తదితర వివరాలను సమర్పించి, ఫేస్ రికగ్నిషన్ కౌంటర్ వద్ద ఫొటో తీయించుకుంటే, వారి పేరిట ఓ ఐడీ జనరేట్ అవుతుంది. ఇది ఒకసారి జరిగే ప్రక్రియ మాత్రమే. ఆపై ఎప్పుడు ఎయిర్ పోర్టులోకి వెళ్లాలన్నా, సెల్ఫ్ కియాస్క్ వద్ద నిలబడి, ముఖాన్ని చూపితే, గేట్లు వాటంతట అవే తెరచుకుంటాయి.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రస్తుతం డిపార్చర్ గేట్ నంబర్ 3 వద్ద ఈ స్కానర్ ను అమర్చారు. తమ వివరాలను నమోదు చేసుకునేందుకు 1, 3వ నంబర్ గేట్ల వద్ద ప్రత్యేక కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ విధానానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోందని, పలువురు తమ వివరాలు నమోదు చేసుకుంటున్నారని అధికారులు అంటున్నారు.

More Telugu News