vijayasanthi: ఇక సినిమాలేనా?... అన్న ప్రశ్నకు విజయశాంతి సమాధానం ఇదీ!

  • ఆరు నెలల క్రితమే అవకాశం వచ్చింది
  • ఎన్నికల బిజీ వల్ల ఓకే అనలేకపోయా
  • ఇప్పుడు ఆ పనులేవీ లేనందునే నటిస్తున్నా

రాజకీయాలు తనకంతగా కలిసిరావన్న అభిప్రాయానికి వచ్చిన సినీనటి విజయశాంతి మళ్లీ తన మాతృ వృత్తి సినిమాలపై దృష్టిసారించారని, ఇకపై ఇండస్ట్రీకే ఆమె పరిమితం కానున్నారని వస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు ముగియడంతో రాజకీయ విశ్రాంతి లభించినందునే సినిమాలపై దృష్టిసారించినట్లు తెలిపారు.

13 సంవత్సరాల విరామం తర్వాత మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో విజయశాంతి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌  ఈనెల 26 నుంచి ప్రారంభం కానుంది. తెలుగు చిత్రపరిశ్రమలో హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక ట్రెండ్‌ సృష్టించుకోవడమేకాక, ఒక దశలో కొందరు హీరోల కంటే అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకున్న విజయశాంతి రాజకీయాల్లో మాత్రం అటువంటి ట్రెండ్‌ సెట్టర్‌ కాలేకపోయారు. బీజేపీలో చేరడంతో రాజకీయ అరంగేట్రం చేసిన విజయశాంతి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. కొన్నాళ్లపాటు కీలక నేతగా వెలిగారు. తర్వాత అక్కడ పొసగక అధికార టీఆర్‌ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆ పార్టీలో కీలకనేతగా వ్యవహరిస్తున్నారు.

ఏఐసీసీ అధ్యక్ష పదవిని రాహుల్‌గాంధీ వదులుకుంటే తాను రాజకీయాలకే పూర్తిగా స్వస్తిపలుకుతానని ఇటీవల సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆమె సినీరంగ పునఃప్రవేశం పట్ల పలు సందేహాలు వ్యక్తం చేసినవారున్నారు. ఇక రాజకీయాలను పూర్తిగా వదిలేసి సినిమాలకే పరిమితమవుతారా? అన్న వ్యాఖ్యలు పెరిగాయి.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో విజయశాంతి మాట్లాడుతూ, ఆరు నెలల క్రితమే తనకు సినిమా అవకాశం వచ్చిందని, అప్పటికి పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించడంతో సాధ్యం కాదని ఒప్పుకోలేదని తెలిపారు. ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు రాజకీయ అవసరాలు పెద్దగా లేనందున సినిమాలపై దృష్టిసారించినట్లు తెలిపారు. ఏ పని అప్పగించినా చిత్తశుద్ధితో చేయడం తనకు అలవాటని వివరించారు.

More Telugu News