Rahul Gandhi: ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్న విషయం మే 23న తేలుతుంది: రాహుల్

  • రాఫెల్ కొనుగోలులో మోదీ అవినీతికి పాల్పడ్డారు
  • తప్పు చేయకపోతే భయం ఎందుకు?
  • కాంగ్రెస్ అధినేత ప్రెస్ మీట్

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల అంకం తుది దశకు చేరుకుంది. ఈ నెల 19న చివరి విడత ఎన్నికలు జరగనుండగా ఇవాళ్టితో ప్రచారపర్వం ముగిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ఈ ఐదేళ్లలో తన తొలి మీడియా సమావేశాన్ని ఎన్నికల ముగింపు దశలో పెట్టడం ద్వారా తన స్వభావం ఏంటో మోదీ చాటుకున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా, ఈసీ కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించిందని, ప్రధాని షెడ్యూల్ కు అనుగుణంగా ఆదేశాలు జారీచేసిందని ఆరోపించారు.

"2014 ఎన్నికల అనంతరం మాకు పార్లమెంటులో తగినంత సంఖ్యాబలం లేకున్నా ప్రతిపక్షంగా సమర్థవంతమైన పాత్ర పోషించాం. అందుకు మేం సంతోషిస్తున్నాం. ప్రతిపక్షంగా మేం నిర్వర్తించిన పాత్రకు 'ఏ' గ్రేడ్ ఇచ్చుకుంటాం. ఈ ఐదేళ్లలో రాఫెల్ పైనే కాదు అనేక అంశాల్లో ప్రధానిని నిలదీశాను. ఆయనకు ఎన్నో ప్రశ్నాస్త్రాలు సంధించాను. ఎక్కడికైనా చర్చకు వచ్చేందుకు సిద్ధం అని చెప్పాను. ఒక్కదానికీ సమాధానం లేదు. చర్చకు పిలిస్తే ఆయన భయపడ్డారు. చౌకీదార్ చోర్ అని దేశ ప్రజలే అంటున్నారు.

రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అనిల్ అంబానీకి ప్రధాని రూ.30,000 కోట్ల మేర దోచిపెట్టింది నిజంకాదా? తప్పుచేయకపోతే ఆయన ఎందుకు బహిరంగ చర్చకు రావడంలేదు? ప్రజలే న్యాయనిర్ణేతలు, వాళ్లు ఏం నిర్ణయించారన్నది చెప్పడానికి నేనెవర్ని. ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్నది మే 23న తేలుతుంది. మోదీ నన్ను దూషించడంపై నాకేమీ బాధలేదు. నన్ను తిట్టడం పట్ల ఆయన సంతోషంగా ఫీలయితే అది ఆయనకే వదిలేస్తాను. నా వరకు ఎలా స్పందించాలన్న విషయాన్నే పరిగణనలోకి తీసుకుంటాను తప్ప మోదీనో, మాయావతో దూషించడం పట్ల  స్పందించబోను" అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News