Chandrababu: ఆ వ్యాఖ్యలు సరికాదు.. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందన

  • ఆపద్ధర్మ ప్రభుత్వంలోనూ ప్రభుత్వానికి అధికారాలుంటాయి
  • వీవీప్యాట్‌పై ఢిల్లీలో ధర్నా
  • వెయ్యి శాతం మేమే గెలవబోతున్నాం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారాలు లేని ముఖ్యమంత్రి అంటూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. ఆపద్ధర్మ ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రికి కొన్ని అధికారాలు ఉంటాయని పేర్కొన్న చంద్రబాబు.. తమది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. అధికారాలు లేని సీఎంగా ఉండాలంటూ వక్రీకరించడం తగదని పరోక్షంగా సీఎస్ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు.

అలాగే జరగాలని అనుకుంటే దేశంలోని ప్రభుత్వాల అధికారమంతా తీసేసి ఎన్నికల సంఘానికే సర్వాధికారాలు కట్టబెట్టాలని అన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలతో గురువారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాము వెయ్యి శాతం గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన బాబు.. ఫలితాలు వెల్లడైన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలూ ఉంటాయన్నారు. ఇందుకోసం పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు.

వీవీప్యాట్‌లపై దేశవ్యాప్తంగా ఉన్న మేధావులందరికీ లేఖలు రాస్తామన్న చంద్రబాబు.. యాభై శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలనే డిమాండ్‌తో అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేయనున్నట్టు చెప్పారు. ఈ విషయంలో స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొస్తున్నాయని, వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెబుతున్నాయని అన్నారు.

More Telugu News