అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగుబాటు!
- ఏపీలోని విశాఖపట్నంలో ఘటన
- అనుమానంతో భార్య శారదకు పైడిరాజు వేధింపులు
- వాగ్వాదం జరగడంతో భార్యపై కత్తితో దాడి
విశాఖలోని కొత్తపాలెం సమీపంలో ఉన్న నాగేంద్ర కాలనీలో ఎద్దు పైడిరాజు తన భార్య శారదతో కలిసి ఉంటున్నాడు. అయితే భార్య శారద మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని పైడిరాజు అనుమానించేవాడు. అంతేకాకుండా ఈ విషయమై రోజూ హింసిస్తూ వేధించేవాడు. ఇదే క్రమంలో నిన్న రాత్రి ఇంటికొచ్చిన పైడిరాజు మరోసారి భార్యతో గొడవకు దిగాడు. దీంతో దంపతుల మధ్య వాగ్వాదం చెలరేగింది. సహనం కోల్పోయిన పైడిరాజు భార్యపై కత్తితో దాడిచేశాడు.
ఈ ఘటనతో తీవ్రంగా గాయపడ్డ శారద ప్రాణాలు కోల్పోయింది. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న పైడిరాజు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ కు కత్తితో వెళ్లి లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని ఈరోజు కోర్టు ముందు హాజరుపరచి రిమాండ్ కు పంపారు. శారద మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.