Hyderabad: పెళ్లి కావడం లేదని మనస్తాపం.. రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

  • 30 ఏళ్లు దాటినా పెళ్లి కావడం లేదని మనస్తాపం
  • స్నేహితులతో చెప్పుకుని బాధపడిన యువకుడు
  • నెక్లెస్ రోడ్డు వద్ద పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య
ఏళ్లొచ్చినా పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఎంఎస్ మక్తాకు చెందిన షేక్ హైదర్ నాలుగో సంతానమైన మహ్మద్ సాబేర్‌కు 31 సంవత్సరాలు. ఇద్దరు అక్కలు, అన్న,  ఇద్దరు తమ్ముళ్లకు వివాహం చేసిన అనంతరం తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో ఒంటరిగా ఉంటున్న సాబేర్ పెయింటింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు.

తనకు 30 ఏళ్లు దాటినా తన పెళ్లి గురించి కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని బాధపడేవాడు. పలుమార్లు స్నేహితుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేశాడు. శుక్రవారం కూడా ఇదే విషయమై స్నేహితుల వద్ద వాపోయాడు. అనంతరం ఉదయం 8 గంటల సమయంలో నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఎంఎంటీఎస్ రైలు రాగానే పట్టాలపైకి పరిగెట్టి తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన నాంపల్లి రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
MMTS
necklace road
Telangana
Suicide

More Telugu News