Andhra Pradesh: ఐటీ గ్రిడ్స్ కేసులో జోరు పెంచిన సిట్.. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన స్టీఫెన్ రవీంద్ర!

  • నేడు హైదరాబాద్ లో సమావేశమైన సిట్ అధికారులు
  • డేటాను సేకరించేందుకు ఓ టీమ్
  • అశోక్ ను పట్టుకునేందుకు మరో బృందం ఏర్పాటు

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కాకరేపుతున్న ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా వ్యవహారంలో సిట్ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఈరోజు అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐటీ గ్రిడ్స్ విచారణ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డేటాను విశ్లేషించడంతో పాటు డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు ఓ టీమ్ ను ఏర్పాటు చేశారు.

అలాగే డేటా గ్రిడ్స్ వ్యవహారంలో సాక్షులు, అనుమానితులను విచారించేందుకు మరో బృందాన్ని నియమించారు. చివరిగా ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా అనుమానిస్తున్న ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ ను పట్టుకోవడానికి మరో టీమ్ ను ఏర్పాటు చేశారు.

కాగా, అశోక్ లొంగిపోయేందుకు ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసిపోవడంతో ఆయన్ను ఏ క్షణమైనా సిట్ అధికారులు అరెస్ట్ చేయొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో సమాచారం ఇవ్వాలని గూగుల్, అమెజాన్ సంస్థలకు సిట్ అధికారులు లేఖ రాశారు.

More Telugu News