KCR: ఏపీ బిర్యానీ పేడ అన్న కేసీఆర్.. నేడు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు: దేవినేని

  • కవిత సోదరుడు జగన్ ను,సీఎంను చేయాలని చూస్తున్నారు
  • మీ ‘పవిత్ర బంధం’ భేష్
  • కేసీఆర్.. వస్తానన్నావుగా.. రా

ఏపీ బిర్యానీ పేడ అని, ఏపీ బ్రాహ్మణులకు మంత్రాలు రావని కామెంట్ చేసిన కేసీఆర్ నేడు వైఎస్ జగన్ ఏపీకి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని మంత్రి దేవినేని ఉమ అన్నారు.  రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు వందశాతం ఓడిపోతారని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తన కుమార్తె కవితతో సుప్రీంకోర్టులో కేసులు వేయిస్తున్న కేసీఆర్ ఏపీలో జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు.  ఇవన్నీ చూస్తుంటే వీరిమధ్య ఎంతటి ‘పవిత్రబంధం’ ఉందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు.

ఏపీ ప్రజల ఆధునిక దేవాలయం, ఆంధ్రుల గుండె చప్పుడు అయిన పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ కుమార్తె సుప్రీంకోర్టులో కేసులు వేస్తున్నారని, మరోవైపు జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటనలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా ప్రభుత్వం కేసు వేస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంప్లీడ్ అవాల్సి వచ్చిందో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. పోలవరం పూర్తికాకుండా ప్రతీనెల అడ్డంపడుతున్న టీఆర్ఎస్ నేతలు నీతులు చెప్పడం మానుకోవాలన్నారు.

‘‘కేసీఆర్.. వస్తానన్నావుగా.. రా. విశాఖపట్నం వచ్చి చెప్పు. లేదంటే ఒకటో తేదీన ముగ్గురూ కలిసి విశాఖపట్నం వచ్చి బహిరంగ సభలో మీ రాజకీయాలు బయటపెట్టండి. మీ అవినీతి రంకులన్నీ బయటపడాలి. కేసీఆర్, జగన్, మోదీ కలిసి ఆడుతున్న జగన్నాటకమిది. రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా మీ చుట్టూ 29 సార్లు తిప్పించుకుని ఈ రోజు అవినీతిపరుడు జగన్‌తో చేతులు కలుపుతారా?’’ అని మోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై కవిత ఎందుకు కేసులు వేశారో కేసీఆర్, కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News