కశ్మీరీ విద్యార్థులపై దాడులు, బహిష్కరణ.. కేంద్రం సహా 11 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
- పుల్వామా ఘటన తర్వాత కశ్మీరీ విద్యార్థులపై దాడులు
- దాడులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
- వివరణ ఇవ్వాలంటూ కేంద్రం సహా 11 రాష్ట్రాలకు నోటీసులు
కశ్మీరీలతో పాటు ఇతర మైనార్టీలపై జరిగిన దాడులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని 11 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సహా ఢిల్లీ పోలీస్ చీఫ్ కు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. తారిక్ అదీబ్ అనే పిటిషనర్ తరపున సుప్రీం సీనియర్ న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో, పిటిషన్ ను వెంటనే విచారించాలని వారు కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎల్ఎన్ రావు, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పిటిషన్ ను విచారించింది.
పుల్వామా ఘటన తర్వాత దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ దాడులకు అడ్డుకట్ట వేసే విధంగా అధికారులను ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. మీడియాలో వచ్చిన డజన్ల కొద్దీ రిపోర్టులను పిటిషన్ కు జత చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీ విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. కశ్మీరీలను, వారి వస్తువులను బహిష్కరించాలంటూ మేఘాలయ గవర్నర్ తథాగథరాయ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఉటంకించారు.