కేసు తీవ్రతను తగ్గించేందుకు దొంగలతో బేరమాడిన ఎస్సై.. ఏసీబీకి పట్టించిన చోరులు
- రూ. 1.60 లక్షలు డిమాండ్ చేసిన ఎస్సై
- ఏసీబీని ఆశ్రయించిన నిందితులు
- రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
పశువుల దొంగతనాలపై వరుసగా కేసులు నమోదవుతుండడంతో రంగంలోకి దిగిన మహేశ్వరం పోలీసులు దొంగల ముఠాపై కన్నేశారు. నజీర్, రాజులే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన ఎస్సై జి.నర్సింహులు వారిని కలిసి లంచం డిమాండ్ చేశాడు. కేసు తీవ్రతను తగ్గించేందుకు తనవంతు సాయం చేస్తానని, అందుకు రూ.1.60 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దొంగిలించిన పశువులను కొనుగోలు చేస్తున్న హర్షద్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేకుండా చేసేందుకు మరో రూ.10 వేలు ఇవ్వాలని కోరాడు.
దీంతో నిందితులందరూ కలిసి ఏసీబీని ఆశ్రయించారు. గతంలో రూ.60 వేలు తీసుకున్న ఎస్సై నర్సింహులును గురువారం మరో రూ. 80 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు.