KTR: చిన్నప్పుడు తన స్కూలు ముందు 'ఐస్‌ గోలా' అమ్మిన వ్యక్తిని కలుసుకుని వరాల జల్లు కురిపించిన కేటీఆర్!

  • నాకెన్నో మధుర జ్ఞాపకాలున్నాయి
  • ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు
  • గృహం మంజూరు చేయిస్తానని హామీ

ముప్పై ఏళ్ల క్రితం అబిడ్స్‌‌లోని గ్రామర్ స్కూల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చదువుకున్నారు. అప్పట్లో ఆ స్కూలు ముందు ఓ వ్యక్తి ఐస్ గోలా అమ్ముతూ ఉండేవాడు. ఇన్నాళ్లకు కూడా అతన్ని గుర్తించి కేటీఆర్ కలుసుకున్నారు. రెండు వారాల క్రితం మహబూబ్‌ అలీ అనే యువకుడు ట్విట్టర్ ద్వారా.. ‘‘కేటీఆర్ సార్, మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీకు ఐస్ గోలా అమ్మిన సయ్యద్ అలీ అనే వ్యక్తి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు’’ అని ట్వీట్ చేశాడు. దానిని చూసిన కేటీఆర్.. తప్పకుండా కలుస్తానని.. సయ్యద్ అలీ విషయంలో తనకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు.

నేడు సయ్యద్ అలీని బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్న కేటీఆర్.. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేశారు. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. గతేడాది ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యిందని తెలిపాడు. అయినా కూడా పొట్ట గడవటం కోసం ఇంకా అదే స్కూలు వద్ద ఐస్ గోలాలు అమ్ముతున్నట్టు తెలిపాడు. వెంటనే స్పందించిన కేటీఆర్ సయ్యద్ అలీకి గృహం మంజూరు చేయిస్తానని మాటిచ్చారు అలాగే వృద్ధాప్య పింఛన్ కూడా మంజూరు చేయిస్తానని తెలిపారు. అతని కుమారులకు కూడా సరైన ఉపాధి చూపిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చి.. వెంటనే ఈ విషయాలపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. దీంతో సయ్యద్ అలీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

More Telugu News