Chandrababu: రోజుకు రూ. 16తో ఏమొస్తుంది?: కేంద్ర బడ్జెట్ పై చంద్రబాబునాయుడు

  • నెలకు రూ. 500 ఇస్తే ఏమొస్తుంది?
  • పేదల జీవితాల్లో వెలుగులేమీ రావు
  • టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబునాయుడు

ఆరుగాలం శ్రమించే రైతన్నకు రోజుకు 16 రూపాయలు ఇచ్చి కేంద్రం ఏం చేయాలనుకుంటుందో తెలియడం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. 5 ఎకరాల భూమి ఉన్న రైతుకు నెలకు రూ. 500 ఇస్తే ఒరిగేదేంటని ప్రశ్నించారు. ఈ ఉదయం పార్టీ నేతలు, ముఖ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు, మోదీ సర్కారు తన చివరి బడ్జెట్ లోనూ ఏపీకి ఎటువంటి సాయమూ చేయలేదని ఆరోపించారు.

 ఈ బడ్జెట్ లో ఏపీ పేరు కూడా వినిపించలేదని మండిపడిన ఆయన, ఈ బడ్జెట్ తో పేదల జీవితాల్లో వెలుగులేమీ రావని అభిప్రాయపడ్డారు. ఆగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్లకు రూ. 8 లక్షల ఆదాయ పరిమితి విధించిన కేంద్రం, సంవత్సరాదాయం రూ. 5 లక్షలు దాటితే పన్ను కట్టాలని ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ఎన్నో విరుద్ధతలతో బడ్జెట్ వచ్చిందని, నిరుద్యోగం పెరిగితే, వృద్ధి రేటు విషయంలో డబ్బాలు కొట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 14 లక్షల మందికి తాను ఉపాధిని చూపగలిగానని, బీజేపీ విఫలం చెందడంతోనే ఇండియాలో ఉద్యోగాలకు తీవ్ర కొరత ఏర్పడిందని అన్నారు.

More Telugu News