West Godavari District: పాలకొల్లులో నేడు దర్శకరత్న దాసరి నారాయణరావు కాంస్య విగ్రహం ఆవిష్కరణ

  • ఆవిష్కరించనున్న దాసరి ప్రియశిష్యుడు మోహన్‌బాబు
  • పాలకొల్లు దాసరి స్వగ్రామం
  • ఎమ్మెల్యే నిమ్మల  రామానాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర, ప్రత్యేకతతో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు కాంస్య విగ్రహాన్ని నేడు ఆవిష్కరించనున్నారు. దాసరి స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు. ఆ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఈ విగ్రహాన్ని దాసరి ప్రియశిష్యుడు, సినీనటుడు మోహన్‌ బాబు ఆవిష్కరించనున్నారు. సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, నిర్మాత, మాటలు, పాటల రచయిత, స్క్రీన్‌ప్లే రైటర్‌గా దాసరి బహుముఖ పాత్రలు పోషించారు. ఉదయం పత్రికను నెలకొల్పి పత్రికాధిపతిగానూ కొన్నాళ్లు కొనసాగారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కూడా దాసరి పనిచేశారు.

తనే కథ, మాటలు, పాటలు సమకూర్చి అక్కినేని నాగేశ్వరరావుతో  దాసరి తీసిన 'ప్రేమాభిషేకం' అప్పట్లో ఓ సంచలన ప్రేమ కథా చిత్రం. అలాగే 1983లో టీడీపీ ఆవిర్భావానికి ముందు విడుదలైన ‘బొబ్బిలి పులి’ చిత్రం ఎన్నికల వేళ ఎన్టీఆర్‌కు ప్లస్‌ అయింది. తెలుగు పరిశ్రమలోని చాలామంది దర్శకులు, నటులు తమ గురువుగా చెప్పుకునే దాసరి నారాయణరావు బహుముఖ ప్రజ్ఞాశాలి.  

More Telugu News