భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్న మేహుల్ చౌక్సీ!
- పాస్ పోర్టును సరెండర్ చేసిన మేహుల్
- పీఎన్బీకి రూ. 13 వేల కోట్లు ఎగ్గొట్టిన కేసులో నిందితుడు
- ఇప్పట్లో ఇండియాకు రప్పించడం కష్టమే
దాదాపు ఏడాదిగా అంటిగ్వాలో ఉంటున్న ఆయన, గడచిన డిసెంబర్ 25న కోర్టు విచారణకు హాజరై, తాను ఇండియాకు వెళ్లలేనని, తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 41 గంటల పాటు ప్రయాణించలేనని చెప్పిన సంగతి తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుకోవచ్చని ఆయన తెలిపారు. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13 వేల కోట్ల మేరకు మోసం చేసి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీకి మేహుల్ స్వయంగా మేనమామే.
గత సంవత్సరం జనవరి తొలివారంలో మేహుల్ దేశం విడిచి వెళ్లిపోయాడు. ఇండియాలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, ఆపై పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మేహుల్ చౌక్సీ తదితరులను ఎలాగైనా వెనక్కు రప్పిస్తామని, వారిని చట్టం ముందు నిలుపుతామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మేహుల్ పౌరసత్వాన్ని వదులుకోవడంతో ఆయన్ను ఇప్పట్లో ఇండియాకు రప్పించడం కష్టసాధ్యమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.