Cricket: అప్పుడు రాయుడిని చూసి బాగా భయపడ్డాను!: ఆసక్తికర విషయం చెప్పిన ధోని

  • శ్రీనివాసన్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ధోని
  • సీఎస్ కే జట్టు బరిలోకి దిగడం ఆనందం కలిగించింది
  • రాయుడు, షేన్ వాట్సన్ పై ధోని ఫన్నీ కామెంట్లు

భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని చాలా సందర్భాల్లో ప్రశాంతంగా ఉంటాడు. టెన్షన్ తో ఇతర ఆటగాళ్లు గోళ్లు కొరికేస్తుంటే మహి మాత్రం నవ్వులు చిందిస్తూ తన పని తాను చేసుకుపోతాడు. అలాంటి ధోనిని భయపెట్టేవాళ్లు ఉన్నారా? అంటే అవుననే జవాబు వస్తోంది. ఈ విషయాన్ని మహి స్వయంగా చెప్పుకొచ్చాడు. ఓ సందర్భంగా తాను భారత ఆటగాడు అంబటి రాయుడితో పాటు ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వాట్సన్ కారణంగా బాగా భయపడ్డానని ధోని తెలిపాడు.

బీసీసీఐ మాజీ చీఫ్ ఎన్.శ్రీనివాసన్ రాసిన ‘డిఫయింగ్ ది పారడైమ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మహి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్ లో పాల్గొనడం చాలా ఆనందం కలిగించిందని తెలిపాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్ కే) ఆటగాళ్లలో రాయుడు, వాట్సాన్ లది దూకుడు మనస్తత్వం అని మహి వెల్లడించాడు.

‘వీరిద్దరిలోనూ రాయుడితో నేను ఎక్కువ టెన్షన్ పడ్డా. ఎందుకంటే బంతి దూరంగా వెళ్లినప్పుడు అంపైర్ వైడ్ లేదా నోబాల్ అని ప్రకటించకుంటే అతనే రెండు చేతులు పక్కకు చాపుతాడు’ అని ఫన్నీ కామెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం పళనిసామి, మాజీ క్రికెటర్లు కపిల్‌ దేవ్‌, ద్రవిడ్‌, సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ తో పాటు పలువురు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు పాల్గొన్నారు.

More Telugu News