కమ్మ ఓట్లు మీకు అవసరం లేదా?: రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలపై రేణుకా చౌదరి ఫైర్
- అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని పలువురు భావిస్తున్నారు
- ఒకే సామాజికవర్గానికి ఎక్కువ సీట్లు ఇవ్వడం శోచనీయం
- సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకుంటా
ఎన్నో రకాలుగా బలమైన కమ్మ సామాజికవర్గానికి ఏ ధైర్యంతో టికెట్ ఇవ్వలేదని రేణుక మండిపడ్డారు. టికెట్లు పొందిన ఇతర సామాజికవర్గ నేతలంతా సరైనవారు, బలమైనవారా? అని ప్రశ్నించారు. మిగిలిన కులాల వారంతా గెలిచేవారేనా? అని అడిగారు. కమ్మ ఓట్లు మీకు అవసరం లేదా? అని దుయ్యబట్టారు. ఒక సామాజికవర్గానికి ఎక్కువ సీట్లు ఇప్పించుకుని, రాజ్యాన్ని ఏలుదామనుకుంటున్నారా? అని మండిపడ్డారు.
సమసమాజం అనేది కాంగ్రెస్, రాహుల్ గాంధీల సిద్ధాంతమని... సిద్ధాంతానికి విరుద్ధంగా రాష్ట్ర నేతలు వ్యవహరించారని రేణుక విమర్శించారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చకూడదనే తాను ఆవేదనను దిగమింగుకుంటున్నానని చెప్పారు. రేపటి ఫలితాలు వ్యతిరేకంగా వస్తే... దీనికి కారణమైన నేతలంతా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందేనని అన్నారు. పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ఉపేక్షించబోనని... కార్యకర్తలతో మాట్లాడి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.