Kerala: యువతుల శబరిమల యాత్రకు కేరళ ప్రభుత్వం నయా ప్లాన్... రంగంలోకి హెలికాప్టర్లు!

  • 17న తెరచుకోనున్న ఆలయం
  • మండల పూజలకు జోరుగా ఏర్పాట్లు
  • మహిళల దర్శనంపై కేరళ సర్కారు సీరియస్ ఆలోచనలు

ఈ నెల 17వ తేదీన మండల పూజల నిమిత్తం శబరిమలలోని అయ్యప్ప ఆలయం తెరచుకోనుండగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఎలాగైనా దర్శనం చేయించాలని కేరళ సర్కారు మరో కొత్త ప్లాన్ వేసింది. ఈ దఫా మహిళలను హెలికాప్టర్లలో కొండపైకి తరలించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. గత నెలలో ఐదు రోజుల పాటు, ఈ నెలలో ఒక రోజు అయ్యప్ప ఆలయం తెరచుకున్నా, ఏ మహిళా దర్శనం చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. పలువురు యువతులు స్వామి దర్శనానికి వస్తామని చెప్పినప్పటికీ, పోలీసులు రక్షణగా ఉన్నప్పటికీ, భక్తుల నిరసనలు వారిని సన్నిధానానికి చేర్చలేకపోయాయి.

ఇదిలావుండగా, సుప్రీంకోర్టు తీర్పును మరోసారి సమీక్షించాలని దాఖలైన పిటిషన్లపై 13న కోర్టు విచారణ జరుపనుండగా, కోర్టు తన తీర్పును సమర్థించుకుంటే, ప్రధానాలయాన్ని తమ అధీనంలోకి తీసుకుని, మహిళా భక్తులను హెలికాప్టర్లలో తరలించి, స్వామి దర్శనం చేయించాలని కేరళ సర్కారు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ శబరిమలకు హెలికాప్టర్ వచ్చిన దాఖలాలు లేవు. దీంతో హెలికాప్టర్ దిగేందుకు అనువైన స్థలం, హెలిపాడ్ నిర్మాణం కోసం ప్రభుత్వం అటవీ శాఖ అనుమతి తీసుకోవాల్సివుంది.

More Telugu News