చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టింగ్ లు.. యువకుడిని జైలుకు పంపిన పోలీసులు!
- అనంతపురం యువకుడి తుంటరి పని
- అభ్యంతకర పోస్టులు, మార్ఫింగ్ ఫొటోలు
- కటకటాల వెనక్కు నెట్టిన అధికారులు
అనంతపురం జిల్లా పాట్రపల్లి గ్రామానికి చెందిన జి.రాజారెడ్డి అనే యువకుడు గత 26న చంద్రబాబు ‘ఆకస్మిక మరణం’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే జగన్, ఎన్టీఆర్ లను చంద్రబాబు కత్తితో పొడుస్తున్నట్లు ‘వెన్నుపోటు బాబు’ అని మార్ఫింగ్ ఫొటోను షేర్ చేశాడు. ఈ పోస్టులను గమనించిన టీడీపీ గుంటూరు జిల్లా ప్రచార కార్యదర్శి చిట్టాబత్తిని శ్రీనివాసరావు, మైనార్టీ సెల్ నాయకుడు మీరావలి అదే రోజు మంగళగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు సంస్థలో ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రాజారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం గుంటూరులోని 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపర్చగా.. రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో నిందితుడిని అధికారులు కటకటాల వెనక్కు నెట్టారు.