నాలాంటి వాడికి అన్యాయం చేస్తే ఆ దేవుడే చూసుకుంటాడు: కేసీఆర్ కు బాబూమోహన్ శాపనార్థాలు

11-10-2018 Thu 14:41
  • నేనేం తప్పుచేశాను?
  • చెప్పుడు మాటలు విని నాకు టికెట్ ఇవ్వరా?
  • ఉగ్రవాదుల కంటే కఠిన శిక్ష వేశారంటూ ఆవేదన
ఆందోల్ టికెట్ తనకు కేటాయించకుండా సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని ఆ పార్టీని వీడిన బాబుమోహన్ మరోమారు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆయన సంగారెడ్డిలో ఈరోజు మీడియాతో మాట్లాడారు. లోకల్ అభ్యర్థికే టికెట్ ఇస్తామని చెప్పిన కేసీఆర్, మరి, గతంలో తనకెందుకు టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు.

‘నేనేం తప్పుచేశాను? చెప్పుడు మాటలు విని టికెట్ ఇవ్వరా? కేసీఆర్ ను నా గాడ్ ఫాదర్ అనుకున్నా.. నేనేం తప్పుచేశానో! కేసీఆర్ వేసిన శిక్ష న్యాయమా? ఉగ్రవాదుల కంటే కఠిన శిక్ష వేశారు. ఇరవై ఐదేళ్ల క్రితమే నేను ఎమ్మెల్యేను. నేను ఇంకా లోకల్ కాదా? నేను తెలంగాణలో పుట్టాను. నేను ఎలా చూసినా లోకలే. నాలాంటి వాడికి అన్యాయం చేస్తే ఆ దేవుడే చూసుకుంటాడు’ అని శాపనార్థాలు పెట్టారు.

 బీసీ, దళితులను ఆదరించిన పార్టీ బీజేపీయేనని, దళితుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత తమ పార్టీదేనని అన్నారు. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని బాబూ మోహన్ ధీమా వ్యక్తం చేశారు.