పరువు హత్యలో దళారీ దందా... కోటి డీల్ అయితే ప్రణయ్ ని నరికిన వ్యక్తికి వచ్చింది రూ. 21 వేలే!

  • రూ. 15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిన మారుతీరావు
  • పంచుకున్న అలీ, బారీ, కరీమ్
  • బీహార్ సుభాష్ శర్మకు ఇచ్చింది నామమాత్రం
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన పరువుహత్యలో దళారుల దందా రాజ్యమేలింది. మారుతీరావు అవసరాన్ని, ఆయన ఆస్తిని దృష్టిలో పెట్టుకున్న మహ్మద్ బారీ, ఎండీ కరీమ్ లు కోటి రూపాయలకు డీల్ మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. ఆపై వారు బీహార్ కు చెందిన సుభాష్ శర్మను రంగంలోకి దింపి, ప్రణయ్ ని హత్య చేయించారు.

అయితే, ఈ వ్యవహారంలో సుభాష్ శర్మకు దక్కింది కేవలం రూ. 21 వేలు మాత్రమేనని తెలుస్తోంది. డీల్ కు అడ్వాన్సుగా రూ. 15 లక్షలను మారుతీరావు ఇవ్వగా, దానిలో అస్గర్ అలీ రూ. 8 లక్షలు, బారీ రూ. 6 లక్షలు, కరీమ్ లక్ష రూపాయలు పంచుకున్నారు. మిగతా రూ. 85 లక్షలూ అందిన తరువాత, సుభాష్ కు రూ. 10 లక్షలు ఇస్తామని వారు చెప్పినట్టు తెలుస్తోంది.

బీహార్ లో సుభాష్ శర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతన్ని ప్రస్తుతం మిర్యాలగూడకు తీసుకువచ్చి విచారిస్తున్నారు. తాను హత్యకు నాలుగు ప్రయత్నాలు చేసి విఫలం అయ్యానని, ఆఖరిసారిగా 14న దాడికి యత్నించానని, అది కూడా విఫలం అయ్యుంటే, తిరిగి బీహార్ వెళ్లుండేవాడినని పోలీసుల విచారణలో శర్మ వెల్లడించినట్టు తెలుస్తోంది. కాగా, సుభాష్ శర్మను పోలీసులు నేడు కోర్టు ముందు హాజరు పరచనున్నారు.
Go Back to Shorts
Miryalaguda
Maruti Rao
Deal
Subhas Sharma
Honor Killing

More Telugu News