‘ఆయుష్మాన్ భవ’ పథకాన్ని ప్రకటించిన ప్రధాని.. పేదలకు వరం!
- పేదల కోసం మరో అద్భుత పథకాన్ని ప్రారంభించిన మోదీ
- వచ్చే నెల 25 నుంచి అందుబాటులోకి
- ఇక పేదల ఆరోగ్యానికి బేఫికర్
‘భారత్-జాతీయ ఆరోగ్య పరిరక్షణ’ పథకాన్ని తొలి విడతలో 10 కోట్ల మందికి వర్తింపజేస్తారు. పథకం అమలు కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. అవసరమైన వైద్య సిబ్బందిని, సదుపాయాలను అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య భారత్ లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుందన్న మోదీ.. పేదల ఇంట్లో ఎవరికైనా రోగం వస్తే ఆ కుటుంబం మొత్తం దిక్కుతోచని స్థితికి చేరుకుంటుందన్నారు. ఇకపై అటువంటి భయాలు అవసరం లేదని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల ఆరోగ్య బీమా లభిస్తుంది. ఈ పథకం ద్వారా పది కోట్ల పేద కుటుంబాలకు ప్రయోజనం కలగనుండగా మొత్తంగా తీసుకుంటే 50 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం కింద ఇప్పటికే 80 శాతం మందిని గుర్తించారు. ఈ పథకంలో చేరిన ప్రతి ఆసుపత్రిలోనూ రోగులకు సాయం అందించేందుకు ప్రత్యేకంగా ఓ ‘ఆయుష్మాన్ మిత్ర’ అందుబాటులో ఉంటారు.