Stalin: 'అయ్యాదురై' అని మనసులో ఉన్నా... కరుణానిధి తన కుమారుడికి 'స్టాలిన్' అనే పేరు పెట్టిన కారణమిదే!

  • పెరియార్ ను అయ్యా అని పిలిచే కరుణానిధి
  • అన్నాదురై పేరు కలిసొచ్చేలా 'అయ్యాదురై' అన్న ఆలోచన
  • స్టాలిన్ మరణానికి నాలుగు రోజుల ముందు పుట్టిన బిడ్డ
  • ఓ సభలో తన బిడ్డకు స్టాలిన్ పేరు ప్రకటించిన కరుణ

కరుణానిధి తన రెండో భార్యకు రెండో కుమారుడిగా పుట్టిన బాబు (ప్రస్తుతం కరుణకు రాజకీయ వారసుడు ఎంకే స్టాలిన్)కు 'అయ్యాదురై' అని పేరు పెట్టాలని మనసులో భావించారట. తనకు ఎంతో ఇష్టమైన నేత పెరియార్ రామస్వామిని కరుణానిధి 'అయ్యా' అని పిలిచేవారు. తనకు నచ్చిన మరో నేత అన్నాదురై పేరులోని 'దురై'ని 'అయ్యా' పక్కన చేర్చి 'అయ్యాదురై' అని పెట్టాలని అనుకున్నారట.

అయితే, 1953, మార్చి 5న రష్యా నేత స్టాలిన్ మరణించగా, ఆ తరువాత స్టాలిన్ సంస్మరణ సభ జరిగింది. ఆ సభ జరిగే నాటికి తన బిడ్డ వయసు కేవలం నాలుగు రోజులే. ఆ సభలోనే తన కుమారుడికి స్టాలిన్ అని పేరు పెడుతున్నట్టు కరుణానిధి బహిరంగంగా ప్రకటించారు. తమిళ భాషను అమితంగా ఇష్టపడి, అభిమానించే ఆయన, ఒక్క స్టాలిన్ కు మినహా మిగతా తన బిడ్డలందరికీ తమిళపేర్లే పెట్టారు. ముత్త, అళగిరి, తమిళరసు, కనిమొళి, సెల్వి ఇలా అందరికీ తమిళ పేర్లు పెట్టారు. స్టాలిన్ కు తమిళేతర పేరు పెట్టాలన్న నిర్ణయం తాను తీసుకున్న ఆకస్మిక నిర్ణయమని ఆయన చెబుతుండేవారు.

More Telugu News