Uttar Pradesh: ఇంత మంది రోమియోలా?... యూపీలో 15 లక్షల మందికి కౌన్సెలింగ్, 4 వేల మంది అరెస్ట్!

  • గత సంవత్సరం ప్రారంభమైన 'యాంటీ రోమియో స్క్వాడ్'
  • మహిళలకు భద్రత కోసం మఫ్టీలో కెమెరాలతో నిఘా
  • అతిగా ప్రవర్తిస్తే అరెస్ట్: లక్నో ఏడీజీ ప్రవీణ్ కుమార్

ఉత్తర ప్రదేశ్ లో మహిళలకు మరింత భద్రత కల్పించాలన్న తలంపుతో గత సంవత్సరం సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించిన 'యాంటీ రోమియో స్క్వాడ్' ఇప్పటివరకూ 15 లక్షల మందికి కౌన్సెలింగ్ నిర్వహించిందని, 4 వేల మందిని అరెస్ట్ చేసిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మహిళలకు భద్రతగా ఈ ప్రచారాన్ని ప్రారంభించామని, అతిగా ప్రవర్తించి, అమ్మాయిలను ఇబ్బందులు పెట్టిన 4 వేల మందికిపైగా యువకులను అరెస్ట్ చేశామని, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సైతం యాంటీ రోమియో స్క్వాడ్ లు పనిచేస్తున్నాయని లక్నో ఏడీజీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ టీమ్ లు తిరుగుతూ ఉంటాయని, రహస్యంగా కెమెరాలు ధరించి మఫ్టీలో ఉండే వీరు, ఈవ్ టీజర్లు, బహిరంగ ప్రదేశాల్లో సమస్యలు సృష్టించే వారి చిత్రాలను బంధిస్తుంటారని తెలిపారు. ఈ టీమ్ లలో మహిళా పోలీసులు కూడా ఉన్నారని అన్నారు. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, పార్కులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వీరు మహిళల భద్రతను రహస్యంగా పర్యవేక్షిస్తుంటారని చెప్పారు.

More Telugu News