Guntur District: కట్నం తేలేదని కోడలిపై అరాచకం.. గదిలో బంధించి మూడు రోజులపాటు చిత్రహింసలు!

షార్ట్స్‌లో చూడండి
వరకట్నం తీసుకురాలేదన్న కారణంతో కోడలిపై అత్తింటి వారు దారుణానికి పాల్పడ్డారు. మూడు రోజులపాటు ఆమెను బంధించి చిత్రహింసలకు గురిచేశారు. చివరికి విషయం తెలుసుకున్న పుట్టింటి వారు రావడంతో, ఆమె అత్తింటి నరకం నుంచి బయటపడగలిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని డోలాస్ నగర్‌లో జరిగిందీ ఘటన.

బాధితురాలు మణి కథనం ప్రకారం.. ఎనిమిదేళ్ల క్రితం ఆమె రాంబాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరిదీ ఒకటే సామాజిక వర్గం కావడంతో పెళ్లికి అడ్డంకులు ఏర్పడలేదు. అయితే, ప్రేమ వివాహం కావడంతో కట్నం లేకుండానే పెళ్లి జరిగింది. దీంతో అప్పటి నుంచి అత్తింటి వారు మణిపై కక్ష గట్టారు. కట్నం తీసుకురాలేదంటూ వేధించ సాగారు. అయితే తనను ఎంతగా హింసిస్తున్నప్పటికీ భరిస్తూనే వచ్చింది కానీ, ఆమె మాత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. దీంతో ఆమెను ఎలాగైనా బయటకు పంపేందుకు అత్తింటి వారు పథకం రచించారు.

ఇంట్లోని డబ్బులు పోయాయని, అవి ఆమే తీసిందని ఆరోపిస్తూ భర్తతో కొట్టించారు. అంతేకాక, ఆమెను ఓ గదిలో బంధించి మూడు రోజులపాటు భర్త, అతని అక్కలు కలిసి చిత్ర హింసలకు గురిచేశారు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. కిందపడేసి జుట్టు కత్తిరించారు. విషయం తెలిసి చుట్టుపక్కల వారు నిలదీస్తే, సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఇష్టం వచ్చినట్టు తిట్టి పంపించారు. దీంతో వారు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే మణి కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి గొడవ చేయడంతో ఆమెను వదిలిపెట్టారు. అనంతరం మణి పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి అత్తింటి వారిపై ఫిర్యాదు చేసింది.
Go Back to Shorts
Guntur District
Tadepalli
Dowry
Woman

More Telugu News