SAI: క్రీడాకారిణులనూ వదలని కోచ్‌లు.. కామాంధులపై ‘సాయ్’ వేటు!

  • సాయ్ రీజనల్ సెంటర్లలో లైంగిక వేధింపులు
  • కోరిక తీర్చకుంటే కెరీర్ ముగిసిపోతుందంటూ హెచ్చరికలు
  • సాటి మహిళా కోచ్‌లు, అకౌంటెంట్లనూ వదలని ‘కామ’కోచ్‌లు

లైంగిక వేధింపులపై వస్తున్న ఫిర్యాదులపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) స్పందించింది. ఓ కోచ్‌పై వేటు వేయగా మరొకరిని రిటైర్మెంట్ తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. సాయ్ అధీనంలో మూడు ప్రాంతీయ కేంద్రాల్లో క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్టు ఫిర్యాదులు అందాయి.

తమిళనాడు సాయ్ కేంద్రంలోని 15 మంది క్రీడాకారిణులు సాయ్ ప్రధాన కార్యాలయానికి లేఖ రాస్తూ తమపై జరుగుతున్న లైంగిక వేధింపులపై మొరపెట్టుకున్నారు. తన కోరిక తీర్చకుంటే క్రీడా జీవితం ముగిసిపోతుందని కోచ్ తమను హెచ్చరించినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.  దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు రహస్యంగా దర్యాప్తు ప్రారంభించారు. 15 మంది జూనియర్ అథ్లెట్లను అక్కడి కోచ్ లైంగికంగా వేధించినట్టు దర్యాప్తులో చేరింది. దీంతో అతడిపై వేటేసిన అధికారులు, మరో కోచ్‌ను తప్పనిసరిగా తప్పుకోవాల్సిందిగా ఆదేశించారు. మరో కోచ్‌పై అంతర్గత దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు సాయ్ అధీనంలోని గుజరాత్, బెంగళూరులోని కేంద్రాల్లోనూ క్రీడాకారిణులపైనా కోచ్‌లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో వాటిపైనా దర్యాప్తు ప్రారంభించారు. బెంగళూరులో అయితే ఓ కోచ్, సహచర మహిళా కోచ్‌ను, అకౌంటెంట్‌ను కూడా వదల్లేదు. అశ్లీల మెసేజ్‌లు పంపి వేధించాడు. కేంద్రాల్లో జరుగుతున్న ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సాయ్ డైరెక్టర్ జనరల్ నీలం కపూర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. లైంగిక వేధింపులు, ఇతర సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు నీలం కపూర్ తెలిపారు.

More Telugu News