kaala: చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ కూడా అంతే!: రజనీకాంత్

  • హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఫంక్షన్
  • ‘కాలా’ అందరికీ నచ్చుతుంది
  • పెదరాయుడుతో తెలుగులో బ్రేక్ వచ్చింది

తమిళ  సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో రజనీకాంత్ మాట్లాడారు. తనపై తమిళ ప్రేక్షకులు ఎంత ప్రేమ చూపిస్తున్నారో, తెలుగు వారూ అంతే ప్రేమ చూపిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఒకానొక సమయంలో తనకు ఎక్కడ కొనసాగాలన్న సందేహం వచ్చిందని, అయితే, బాలచందర్ సినిమాతో తన కెరీర్ అక్కడే ప్రారంభం కావడంతో తమిళంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

తెలుగులో తనకు ‘పెదరాయుడు’తో బ్రేక్ వచ్చిందన్నారు. ఆ తర్వాతి నుంచి తన సినిమాలన్నీ ఇక్కడ విడుదలయ్యాయని పేర్కొన్నారు. తాను హైదరాబాద్ ఎప్పుడొచ్చినా ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకునే వాడినని రజనీ గుర్తు చేసుకున్నారు. తన మరో గురువు దాసరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

  ‘ఒకే రజనీకాంత్’ అంటూ ధనుష్ చేసిన వ్యాఖ్యలపై రజనీ స్పందిస్తూ ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంటుందని, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్.. ఇలా ఎవరికి వారేనని, ఎవరి ప్రాముఖ్యం వారిదని స్పష్టం చేశారు. ‘కబాలి’ చేసినప్పుడు ఇంత చిన్న దర్శకుడితో చేస్తున్నారేంటి? అని అనుకున్నారని, కథ నచ్చడం, మంచి సందేశం ఉండడంతో ఆ సినిమా చేసినట్టు చెప్పుకొచ్చారు. అయితే, కమర్షియల్‌గా మాత్రం అది హిట్ కాలేదన్నారు. ముంబై మురికివాడల నేపథ్యంలో తీసిన ‘కాలా’ సినిమాలోని ఐదారు పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని రజనీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News