poet: ప్రముఖ కవి, రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూత!

  • తుదిశ్వాస విడిచిన బాలాంత్రపు రజనీకాంతరావు (99)
  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడ్డ సాహితీవేత్త 
  • సంతాపం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
  • ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ బాలాంత్రపు రజనీకాంతరావు (99) తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కవి, రచయిత, వాగ్గేయకారుడు రజనీకాంతరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకరైన బాలాంత్రపు రజనీకాంతరావు. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,  పలువురు కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు తమ సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో రజనీకాంతరావుకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు.

1920 జనవరి 29న పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో రజనీకాంతరావు జన్మించారు. ఆయన తండ్రి  బాలాంత్రపు వేంకటరావు. వేంకట పార్వతీశ కవులలో వేంకటరావు ఒకరు. రజనీకాంతరావు తల్లి వెంకటరమణమ్మ కూడా గొప్ప సాహితీ సంస్కారం గల వ్యక్తి. 1942 జులైలో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో కళాకారుడిగా రజనీకాంతరావు చేరారు. ఆకాశవాణిలో తొలి స్వరకర్తగా శ్రోతలను అలరించారు. ఆకాశవాణిలో భక్తిరంజని, ధర్మసందేహాలు వంటి కార్యక్రమాలతో రజనీకాంతరావు అందరకీ సుపరిచితుడు.  

‘పాషాకలం’ పేరుతో గేయ కవితలు, చండీదాస్, గ్రీష్మ రుతువు వంటి స్వీయరచనలు ఆయన చేశారు. ‘జేజి మామయ్య’ పేరుతో చిన్నపిల్లల పాటలను ఆకాశవాణిలో రజనీకాంతరావు ప్రసారం చేశారు. పలు చిత్రాలకు ఆయన సంగీత దర్శకత్వం వహించారు. 20వ శతాబ్దంలో తెలుగులో వచ్చిన గొప్ప పుస్తకాల్లో రజనీకాంతరావు రచించిన ‘వాగ్గేయకార చరిత్ర’ కూడా ఒకటి. విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వారిలో రజనీకాంతరావు కూడా ఒకరు. ‘శ్రీసూర్యనారాయణ..వేద పారాయణ’ అంటూ రేడియోలో ప్రసారమయ్యే సూర్యస్తుతి ఆయన రూపొందించినదే. బహుముఖ ప్రజ్ఞాశాలి బాలాంత్రపు రజనీకాంతరావు.. ‘రజని’గా ప్రసిద్ధులు.

More Telugu News