President Of India: రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం సమర్పించిన వైసీపీ ఎంపీలు

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను వైసీపీ ఎంపీలు ఈరోజు కలిశారు. రాష్ట్రపతి నివాసానికి మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైఎస్ అవినాష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్లారు. తాము రాజీనామాలు చేయడానికి కారణం, అందుకు దారితీసిన పరిస్థితులను రాష్ట్రపతికి వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా తాము చేస్తున్న పోరాటాన్ని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు అన్ని అంశాలపై ఓ వినతిపత్రం సమర్పించారు. ఏపీని కేంద్రం పట్టించుకోవడం లేదని, విభజన హామీలు అమలు చేయడం లేదని, కేంద్ర ప్రభుత్వం తీరుతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని విన్నవించిన ఎంపీలు, ఈ విషయమై కలుగజేసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రపతికి అన్ని విషయాలు వివరించాం: ఎంపీ మేకపాటి

రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఎంపీ మేకపాటి  రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రామ్ నాథ్ కోవింద్ కు అన్ని విషయాలు వివరించామని చెప్పారు. రాజ్యాంగపరంగా తాను ఏం చేయగలనో అది చేస్తానని కోవింద్ తమతో చెప్పారని అన్నారు. ప్రత్యేకహోదా ఏపీ ప్రజల హక్కు అని, ఎప్పటికైనా సాధించుకుంటామని, విభజన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని, బాబు వైఖరితో ఏపీకి నష్టం వాటిల్లిందని విమర్శించారు.

తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరాం: వైవీ సుబ్బారెడ్డి

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జోక్యం చేసుకోవాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరామని  ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.చిత్తశుద్ధితోనే తమ పదవులకు రాజీనామాలు  చేశామని, తమ రాజీనామాలు తప్పకుండా ఆమోదం పొందుతాయని అన్నారు.
Go Back to Shorts
President Of India
YSRCP

More Telugu News