kalva srinivasulu: స‌గంలో నిలిచిన ఇళ్ల‌కూ సాయం.. ఈ ఏడాది 5.64 ఇళ్లు నిర్మించాల‌న్న‌దే ల‌క్ష్యం: ఏపీ మంత్రి కాల‌్వ శ్రీ‌నివాసులు

  • కేంద్రం నుండి ఇళ్ల నిర్మాణానికి స‌క్ర‌మంగా సాయం అంద‌డం లేదు
  • తొలివిడ‌త‌లో రూ.1018 కోట్లు విడుద‌ల చేయాల్సి ఉంది
  • రూ.181 కోట్లు మాత్ర‌మే విడుద‌ల చేశారు
  • అక్ర‌మాల‌కు తావులేకుండా ఇళ్ల నిర్మాణం

రాష్ట్రంలో ఇళ్లులేని ప్ర‌తి కుటుంబానికి ప‌క్కా ఇళ్లు నిర్మించాల‌న్న త‌మ‌ ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాల‌కు కేంద్రం నుండి త‌గిన స‌హ‌కారం ల‌భించ‌డం లేద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామీణ గృహ‌నిర్మాణ, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ‌ల మంత్రి కాల‌్వ శ్రీ‌నివాసులు అన్నారు. శాస‌న‌మండ‌లిలో గృహ‌నిర్మాణంపై ఈ రోజు జ‌రిగిన స్వ‌ల్ప వ్య‌వ‌ధి చ‌ర్చ‌కు మంత్రి స‌మాధాన‌మిచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌ల‌హీన వ‌ర్గాల ఇళ్ల‌ నిర్మాణంకోసం వేలాది కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ప్ప‌టికీ కేంద్రం నుండి మంజూరైన ఇళ్ల‌కు కూడా త‌గిన రీతిలో నిధులు అంద‌డం లేద‌న్నారు.

ఇళ్ల మంజూరులో అన్యాయం జ‌ర‌గ‌డంతో పాటు మంజూరు చేసిన ఇళ్ల‌కు నిధుల విడుద‌ల విష‌యంలోనూ కేంద్రంలో అల‌క్ష్య ధోర‌ణి క‌నిపిస్తోంద‌న్నారు. ప‌ట్ట‌ణ గృహ‌నిర్మాణానికి తొలివిడ‌త‌లో రూ.1018 కోట్లు విడుద‌ల చేయాల్సి ఉండ‌గా రూ.181 కోట్లు మాత్ర‌మే విడుద‌ల చేశార‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో బ‌ల‌హీన వ‌ర్గాల ఇళ్ల నిర్మాణంలో అక్ర‌మాల‌కు తావులేకుండా చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని మంత్రి పేర్కొన్నారు. అక్ర‌మాల‌ను నిరోధించేందుకు గృహ‌నిర్మాణ శాఖ‌లో పెద్ద ఎత్తున సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామ‌ని చెప్పారు.

నిర్మాణంలో ఉన్న ఇళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవ‌డంతోపాటు బిల్లుల స‌త్వ‌ర చెల్లింపుకోసం పార‌ద‌ర్శ‌క విధానాలు అనుస‌రిస్తున్న‌ట్టు కాల్వ శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రంలో అర్థాంత‌రంగా ఆగిపోయిన ఇళ్ల‌ను పూర్తిచేసేందుకు రూ.500 కోట్లు బ‌డ్జెట్‌లో కేటాయించామ‌ని, ఇళ్ల నిర్మాణం ఆగిపోయిన ద‌శ నుండి ఇంటిని పూర్తిచేసేందుకు అవ‌స‌ర‌మైన సాయాన్ని ల‌బ్దిదారుల‌కు అందిస్తామ‌న్నారు. పేద‌ల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌న్నారు. ప్ర‌జా జీవ‌నాన్ని ఉన్న‌త ప్ర‌మాణాల‌కు తీసుకువెళ్లే ఉద్దేశంతోనే ముఖ్య‌మంత్రి వేల కోట్లు ఖ‌ర్చు చేసేందుకు కూడా వెనుకాడ‌టం లేద‌న్నారు.

గృహ‌నిర్మాణాల ద్వారా రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల విలువైన ఆస్తుల‌ను సృష్టిస్తున్నామ‌ని పేర్కొన్నారు. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో గృహ‌నిర్మాణానికి మంజూరు చేసిన రుణంలో కొంత స‌బ్బిడీగా ఇచ్చే వార‌ని, త‌మ ప్ర‌భుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్ష‌లు పూర్తి ఉచితంగా ఇస్తోంద‌న్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో మూడు ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మించామ‌న్నారు. వ‌చ్చే మార్చి నాటికి రాష్ట్రంలో ప‌ది ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మించాల‌ని  చంద్ర‌బాబు నాయుడు త‌మ‌కు ల‌క్ష్యంగా నిర్దేశించార‌ని, ఈ ల‌క్ష్య సాధ‌న దిశ‌గా తాము కృషిచేస్తున్న‌ట్టు మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో షెడ్యూలు కులాలు, తెగ‌ల వారికి చ‌ట్ట‌ప‌రంగా ద‌క్కాల్సిన వాటా కంటే అధికంగా గ‌త మూడేళ్ల‌లో ఇళ్లు మంజూరు చేశామ‌న్నారు. ఇందులో ఎస్సీల‌కు 95,679 ఇళ్లు (22.94 శాతం), ఎస్టీల‌కు 29,923 ఇళ్లు (7.17శాతం) మంజూరు చేశామ‌న్నారు. రాష్ట్రంలో గ‌త ప్ర‌భుత్వాల హయాంలో రూ.4,150 కోట్ల మేర‌కు ఇళ్ల నిర్మాణంలో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు విజిలెన్స్ విభాగం నివేదిక అంద‌జేసింద‌ని, 14.4 ల‌క్ష‌ల ఇళ్లు రికార్డుల్లో చూపిన‌వి క్షేత్ర‌స్థాయిలో క‌నిపించ‌డం లేద‌న్నారు.

విజిలెన్స్ విభాగం 149 గ్రామాల్లో 12,489 ఇళ్ల‌ను న‌మూనా త‌నిఖీలు చేసింద‌ని, ఇందులో 1200 ఇళ్ల నిర్మాణంలో అక్ర‌మాలు జ‌రిగిన‌ట్లు తేలింద‌న్నారు. ఇందులో 190 మందికి ప్ర‌మేయం ఉన్న‌ట్టు నిర్ధారించార‌ని తెలిపారు. ఈ అక్ర‌మాల‌కు సంబంధించి 554 క్రిమిన‌ల్ కేసులు న‌మోద‌య్యాయ‌న్నారు. ఇందులో 113 గృహ‌నిర్మాణ సంస్థ అధికారులు, 15 మంది ఇత‌ర శాఖ‌ల అధికారులు, మ‌రో 55 మంది అన‌ధికారుల‌పై కూడా కేసులు న‌మోదు చేశార‌ని చెప్పారు.  

More Telugu News