దక్షిణాఫ్రికా టూర్‌కు భారత వన్డే జట్టు ఎంపిక.. మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌లకు పిలుపు.. రాహుల్ ఔట్!

షార్ట్స్‌లో చూడండి
దక్షిణాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్ ఆడనున్న భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఫిబ్రవరి1 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. సెలక్టర్లు ప్రకటించిన 17 మంది స్క్వాడ్‌లో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌లకు చోటు లభించింది. శ్రీలంకతో తలపడిన జట్టులో పెద్దగా మార్పులు చేయకుండానే వీరిద్దరికీ చోటు కల్పించారు. కాగా, వాషింగ్టన్ సుందర్, సిద్ధార్థ కౌల్‌లకు ఉద్వాసన తప్పలేదు. ఈ ఏడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో షమీ, ఆగస్టు-సెప్టెంబరులో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో శార్దూల్ చివరిసారి ఆడారు.

వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, అజింక్యా రహానే ఓపెనర్లుగా వ్యవహరించనుండగా శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్‌లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అయితే శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. గాయంతో బాధపడుతూ వన్డే, టీ20 సిరీస్‌కు దూరమైన కేదార్ జాదవ్ తిరిగి జట్టులో చేరనున్నాడు.

దక్షిణాఫ్రికాలో భారత్-దక్షిణాఫ్రికా జట్లు 28 సార్లు తలపడగా భారత్ ఐదుసార్లు మాత్రమే విజయం సాధించి 21 సార్లు ఓటమి పాలైంది. తాజా సిరీస్‌లో భారత్ మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జనవరి 5న తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

భారతజట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధవన్, అజింక్యా రహానె, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, హార్ధిక్ పాండ్యా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్,  భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్.
Go Back to Shorts
Team India
South Africa
Mohammed Shami
Shardul Thakur

More Telugu News