Jayalalitha: జయలలితది అనారోగ్యం కాదు.. ఆమెపై దాడి జరిగింది.. దీప వాంగ్మూలం

  • జయ మృతిపై మేనకోడలు దీప అనుమానాలు
  • ఆరోజు పోయెస్ గార్డెన్‌లో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు
  • శశికళ కుటుంబ సభ్యులతోపాటు జయ వంటమనిషిని విచారించాలని డిమాండ్

జయలలిత అస్వస్థతకు గురయ్యే అవకాశమే లేదని, ఆమెపై కచ్చితంగా దాడి జరిగి ఉంటుందని జయ మేనకోడలు దీప అనుమానం వ్యక్తం చేశారు. జయ మృతిపై వేసిన నిజనిర్ధారణ కమిటీ ఎదుట గురువారం హాజరైన దీప ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత అస్వస్థతకు గురయ్యే అవకాశమే లేదని ఏకసభ్య  కమిషన్‌కు తెలిపినట్టు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చేరడానికి ముందు రోజు రాత్రి 9 గంటల వరకు జయ చురుగ్గా పనిచేశారని, అంతలోనే ఒక్కసారిగా ఎలా అస్వస్థతకు గురవుతారని ప్రశ్నించారు. ఆమెపై దాడి జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

గతేడాది సెప్టెంబరు 22న అపోలో ఆసుపత్రిలో చేరకముందు జయ ఆరోగ్యంగానే ఉన్నారని దీప పేర్కొన్నారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. జయలలితకు సుదీర్ఘకాలంగా వంట చేస్తున్న రాజమ్మను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. జయ నివసించిన పోయెస్ గార్డెన్‌తో సంబంధంలేని ఆరుగురు వ్యక్తులు ఆరోజు ఇంట్లో ఉన్నట్టు ఆమె పొరిగింటి వ్యక్తి ఒకరు తనకు చెప్పారని, కాబట్టి ఈ విషయంపై విచారణ చేపట్టాలని  కమిషన్‌ను కోరినట్టు దీప పేర్కొన్నారు.

More Telugu News