BJP: పవన్ విమర్శలపై స్పందించిన విష్ణుకుమార్ రాజు, హరిబాబు, పురందేశ్వరి... ఎవరేమన్నారంటే!

  • తోలు మందం వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించిన విష్ణుకుమార్ రాజు
  • ఎవరిని గెలిపిస్తారన్న విషయం ప్రజలదేనన్న హరిబాబు
  • ఎక్కడ లోపముందో చెబితే పరిశీలిస్తామన్న పురందేశ్వరి
  • ఆచితూచి స్పందించిన బీజేపీ నేతలు

విశాఖలో పర్యటించిన పవన్ కల్యాణ్, వివిధ సందర్భాల్లో బీజేపీ నేతలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు స్పందించారు. "బీజేపీ నేతల తోలు మందం అయిపోయింది" అన్న పవన్ వ్యాఖ్యలపై విష్ణుకుమార్ రాజు వ్యంగ్యంగా స్పందించారు. "తోలు మందం అయిపోయిందా? నన్ను చూసి అలా అన్నారేమో... లావు అయ్యాను నేను. ఆయన సన్నంగా ఉంటారు. ఆయన చర్మం పలచగా ఉంటుంది. నేను లావుగా ఉంటాను. ఇంకో విషయం అసెంబ్లీలో నాది ఫస్ట్ సీటు. అందుకని కెమెరా వాడు లావుగా చూపిస్తున్నాడు. అదో ప్రాబ్లం నాకు" అన్నారు.

ఇక పవన్ వ్యాఖ్యలపై హరిబాబు స్పందిస్తూ, "నేను 42 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను. 1972లో విద్యార్థి నాయకుడిగా పనిచేశా. శాసన సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశా. నేను సమస్యలను పట్టించుకోలేదనుకుంటే... నాకంటే సమస్యలను బాగా పట్టించుకునే వాళ్లు ఉంటే చూపండి. నేను సంతోషిస్తా. ఎవరిని గెలిపిస్తారో, ఎవరిని ఓడిస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. నేను గెలుస్తానని చెప్పలేదు. ఓడిపోతానని చెప్పలేదు. ఎన్నికలు జరిగితే, ఎన్నికల్లో పోటీ చేస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే విజయం లభిస్తుంది" అన్నారు.

ఇక పురంధేశ్వరి మాట్లాడుతూ, "వారి మనోభావం అది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ప్రజలకు సహకరించడం లేదో, ఎక్కడ సంక్షేమానికి పెద్ద పీట వేయడంలేదో ఒక్కసారి తెలియజేస్తే, వారి అనుమానాలు నివృత్తి చేస్తాం" అని తెలిపారు. పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, బీజేపీ నేతలు ఆచితూచి స్పందించడం గమనార్హం.

More Telugu News