airtel: ఖాతాదారుడి ఆమోదం లేకుండానే పేమెంట్ బ్యాంక్ ఖాతాలు.. ఎయిర్ టెల్ కు యూఐడీఏఐ షాక్!

  • అక్రమాలకు పాల్పడిన ఎయిర్ టెల్
  • మొబైల్ నెంబర్ కు ఆధార్ లింక్
  • ఆధార్ లింక్ ఆధారంగా పేమెంట్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిన ఎయిర్ టెల్

దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ కి యూనిక్‌  ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) భారీ షాక్‌ ఇచ్చింది. కస‍్టమర్ల అనుమతి లేకుండా వారి పేరుతో పేమెంట్ అకౌంట్ల ఖాతాలు తెరుస్తూ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించింది. మొబైల్‌ నంబర్లకు ఆధార్ నెంబర్ లింకింగ్ రూల్ ను టెలికాం సంస్థలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎయిర్ టెల్ అలా లింకింగ్ కోసం రిక్వెస్ట్ చేసిన వారి పేరిట ఆ ఆధార్ నెంబర్లతో వారికి తెలీకుండా పేమెంట్‌ అకౌంట్లని సృష్టించింది.

ఎల్పీజీగ్యాస్ సిలెండర్ బుక్ చేసినప్పుడు (డైరెక్ట్ బెనిఫిట్ బదిలీ) వచ్చే సబ్సిడీని  ఎయిర్‌ టెల్‌ పేమెంట్‌ ఖాతాలో చేరేలా చేసింది. వాస్తవానికి ఎయిర్ టెల్ ఖాతాదారులు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని ఇతర బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసినా, ఆ ఖాతాలకు కాకుండా సబ్సిడీ మొత్తం ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకు ఖాతాల్లో పడేలా అక్రమాలకు పాల్పడింది.

 దీంతో షాక్ తిన్న ఎయిర్‌ టెల్‌ యూజర్లు యూఐడీఏఐకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఆ సంస్థ ఆధార్‌ చట్టాన్ని ఉల్లంఘించిన కేసుపై ఎయిర్‌ టెల్‌ పై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఆ టెలికాం ఆపరేటర్‌ కు (ఎయిర్‌ టెల్‌ పేరు చెప్పలేదు) నోటీసులు జారీ  చేశామని వెల్లడించింది. వినియోగదారుడికి తెలియకుండా బ్యాంకు ఖాతాలు తెరవడం నేరమని, దీనిపై భారీ జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా, దీనిపై ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ ఉన్నతాధికారులు స్పందిస్తూ, ఆధార్‌, మొబైల్‌ లింకింగ్‌ వేరు, పేమెంట్‌ బ్యాంకు ఖాతాలు తెరవడం వేరని, ఆ రెండింటికీ సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎయిర్ టెల్ పేమెంట్ బాంక్ ఖాతా వినియోగదారుడిచే ఆధార్ లింక్డ్ ఖాతాగా ఉంటే డీబీటీ (డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ ఫెర్) ఆటోమెటిగ్గా అవుతుందని తెలిపారు. 

More Telugu News