YSRCP: అది నా ట్వీట్ కాదు.. ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ‘సాక్షి’ చైర్‌పర్సన్ వైఎస్ భారతి వివరణ

  • తనకు సోషల్ మీడియాలో ఖాతాలు లేవన్న భారతి
  • తన పేరుతో ఎవరో నకిలీ ఖాతా సృష్టించి ఉంటారని వివరణ
  • ఆంధ్రజ్యోతి కథనం వాస్తవ దూరమన్న జగన్ సతీమణి

‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ఓ కథనంపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సతీమణి, సాక్షి మీడియా గ్రూపు సంస్థల చైర్ పర్సన్ వైఎస్ భారతి వివరణ ఇచ్చారు. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ మార్గమధ్యంలో ఓ పొలంలోని పంపుకింద నీళ్లను తాగుతున్నట్టు ఉంది. ఫేస్‌బుక్‌లో వైఎస్ భారతి పేరుపై ఉన్న ఖాతాలో ఈ ఫొటో పోస్ట్ అయింది. ‘జగన్ ప్రజల కోసం ఎంతగా తపిస్తున్నాడో చెప్పడానికి ఈ ఒక్క ఫొటో చాలు’ అన్న అర్థం వచ్చేలా క్యాప్షన్ రాశారు.

వైఎస్ భారతి పేరుతో పోస్ట్ అయిన ఈ ఫొటో నిజానికి జగన్‌ది కాదు. జగన్‌లా ఉన్న మరో వ్యక్తిది. దీంతో సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. ‘భారతి తన భర్తను గుర్తించలేకపోయారా? అన్న సందేహాలను కొందరు వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి కథనంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇదికాస్తా వైరల్ కావడంతో భారతి స్పందించారు. ఆ ఫొటో తాను పోస్టు చేసింది కాదని, తనకు ఫేస్‌బుక్‌లో కానీ, ట్విట్టర్‌లో కానీ ఖాతాలు లేవని స్పష్టం చేశారు. తన పేరుతో ఎవరైనా నకిలీ ఖాతా సృష్టించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి కథనం పూర్తిగా వాస్తవదూరమని భారతి స్పష్టం చేశారు.

More Telugu News