pbl: పీబీఎల్ వేలంలో రూ. 62 ల‌క్ష‌లు ప‌లికిన హెచ్.ఎస్‌.ప్ర‌ణ‌య్‌.. ఇదే అత్యధిక ధర!

  • గ‌తేడాది రూ. 25 ల‌క్ష‌లు ప‌లికిన ప్ర‌ణ‌య్‌
  • ఏకంగా 150 శాతం పెరుగుద‌ల‌
  • పాత ఫ్రాంఛైజీల్లోనే సింధు, సైనా

ప్రీమియ‌ర్ బ్యాడ్మింట‌న్ లీగ్ (పీబీఎల్‌) నాలుగో సీజ‌న్ కోసం సోమ‌వారం వేలం నిర్వ‌హించారు. ఈ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా హెచ్‌. ఎస్‌. ప్ర‌ణ‌య్ నిలిచాడు. అహ్మ‌దాబాద్ స్మాష్ మాస్ట‌ర్స్ ఫ్రాంఛైజీ అత‌న్ని సొంతం చేసుకోవ‌డానికి రూ. 62 లక్ష‌లు వెచ్చించింది. గ‌తేడాది ప్ర‌ణ‌య్‌ని రూ. 25 ల‌క్ష‌ల‌కు ముంబై రాకెట్స్ చేజిక్కించుకుంది. అప్ప‌టి ధ‌ర‌తో పోలిస్తే ఈసారి అత‌డి ధ‌ర‌లో ఏకంగా 150 శాతం పెరుగుద‌ల క‌నిపించింది.

గ‌డ‌చిన ఏడాది కాలంలో వివిధ అంత‌ర్జాతీయ టోర్నీల్లో ప్ర‌ణ‌య్ చూపించిన ప్ర‌తిభే ఇంత ధ‌ర ప‌ల‌క‌డానికి కార‌ణ‌మైంది. మ‌రోప‌క్క‌ భారత స్టార్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌లను పాత ఫ్రాంఛైజీలే అట్టిపెట్టుకోవడంతో వాళ్లు వేలంలోకి రాలేదు. పీబీఎల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం క్రీడాకారుల‌ను త‌మ వ‌ద్దే ఉంచుకోవాల‌నుకున్న ఫ్రాంచైజీలు వారికి గ‌తేడాది చెల్లించిన మొత్తం కంటే 25 శాతం అద‌నంగా ఇవ్వాలి. దీంతో రూ. 48.75 ల‌క్ష‌ల‌తో సింధు చెన్నై జ‌ట్టులో, రూ. 41.25 ల‌క్ష‌ల‌తో సైనా అవ‌ధె జ‌ట్టులో ఉండిపోయారు. ఈ లెక్కన చూస్తే... సింధు, సైనాల కంటే ప్రణయే ఎక్కువ రేటు పలికినట్లు.

గ‌తేడాది అవ‌ధె జ‌ట్టు త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన కిడాంబి శ్రీకాంత్‌ను ‘రైట్‌ టు మ్యాచ్‌’ కింద అదే జ‌ట్టు రూ.56.10 లక్షలకు దక్కించుకుంది. శ్రీకాంత్ అన్న కిడాంబి నంద‌గోపాల్‌ను రూ. 1 ల‌క్ష‌కు (కనీస ధర) అహ్మ‌దాబాద్ సొంతం చేసుకుంది. ఇక సాయిప్రణీత్ కూడా  హైదరాబాద్‌ హంటర్స్‌లోనే కొన‌సాగ‌నున్నాడు. కాక‌పోతే ఈసారి హైద‌రాబాద్ ఫ్రాంచైజీ అత‌డి కోసం రూ. 40 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టింది. గ‌తేడాది కేవ‌లం రూ. 20 ల‌క్ష‌ల‌కే సొంతం చేసుకుంది. ఇక సమీర్‌ వర్మ (రూ.52 లక్షలు- ముంబయి రాకెట్స్‌), అజయ్‌ జయరాం (రూ.45 లక్షలు- నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌)లకు మంచి ధర పలికింది. పారుపల్లి కశ్యప్‌ను రూ.20 లక్షలకు అవధె జ‌ట్టు కొనుక్కోగా.. గురుసాయిదత్‌ రూ.12 లక్షలకు, ప్రణవ్‌ రూ.18 లక్షలకు, అశ్విని పొన్నప్పను రూ.20 లక్షలకు దిల్లీ జ‌ట్టు సొంతం చేసుకుంది. సౌరభ్‌ వర్మ రూ.13 లక్షలు (అహ్మదాబాద్‌) పలికాడు.

విదేశీ క్రీడాకారుల విష‌యానికి వ‌స్తే చైనా ఆట‌గాడు తియాన్‌ హూవీ (రూ.58 లక్షలు- దిల్లీ ఏసర్స్‌)కి అత్యధిక ధర ప‌లికాడు. షిన్‌ బీక్‌ (రూ.55 లక్షలు), క్రిస్‌ అడ్‌కాక్‌ (రూ.54 లక్షలు- చెన్నై), తై జు యింగ్‌ (అహ్మదాబాద్‌- రూ.52 లక్షలు), వాంగ్‌ జు వీ (రూ.52 లక్షలు- నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌), అక్సెల్సెన్‌ (బరూ.50 లక్షలు- బెంగళూరు), సాన్‌ వాన్‌ హొ (రూ.50 లక్షలు- ముంబయి) కూడా మంచి ధరే దక్కించుకున్నారు.  

ఈ వేలం పాట‌లో అత్యధికంగా ఖర్చు చేసిన ఫ్రాంచైజీ హైదరాబాద్‌ హంటర్స్‌ (రూ.2 కోట్ల 39.25 లక్షలు) కాగా తక్కువగా ఖర్చు చేసిన ఫ్రాంచైజీ నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ (రూ.2.21 కోట్లు). పీబీఎల్ నిబంధనల ప్రకారం ప్రతి జట్టు 11 మంది క్రీడాకారులను తీసుకోవచ్చు. అందులో గరిష్టంగా ఐదుగురు విదేశీ క్రీడాకారులు.. కనీసం ముగ్గురు క్రీడాకారిణులు ఉండాలి. ప్రతి జట్టు ఒక అండర్‌-17 క్రీడాకారుడిని తీసుకోవాలని ఈసారి నిబంధన తీసుకొచ్చారు.

More Telugu News