తెర మీద‌కి బిన్ లాడెన్ వార‌సుడు హమ్‌జా... అల్ ఖైదా ప‌గ్గాలు చేప‌ట్టే అవ‌కాశం

19-09-2017 Tue 12:36
  • అనుమానాలు రేకెత్తిస్తున్న ఫొటో
  • ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌ను క‌లుపుకునే అవ‌కాశం
  • తండ్రి మ‌ర‌ణానికి ప్ర‌తీకారం తీర్చుకుంటాడంటున్న విశ్లేష‌కులు

అమెరికా 9/11 ఉదంతం జ‌రిగి 16 సంవ‌త్స‌రాలు గ‌డిచిన సంద‌ర్భంగా తీవ్ర‌వాద సంస్థ అల్ ఖైదా ఓ ఫొటో విడుద‌ల చేసింది. ఇందులో ఒసామా బిన్ లాడెన్ ప‌క్క‌న అత‌ని కుమారుడు హమ్‌జా కూడా ఉన్నాడు. దీంతో ప్ర‌స్తుతం 28 ఏళ్లు ఉన్న హ‌మ్‌జాను అల్ ఖైదా త‌మ నాయ‌కుడిగా ఎంచుకోబోతోందా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మిల‌ట‌రీ విధానాల్లో లోప‌భూయిష్టంగా ఉన్న ఇస్లామిక్ స్టేట్ బృందాన్ని కూడా క‌లుపుకుని జిహాదిస్టులంద‌రినీ హ‌మ్‌జా ఏకం చేసే అవ‌కాశాలున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

గ‌తంలో హమ్‌జా విడుద‌ల చేసిన ఆడియో మెసేజ్‌లు కూడా ఈ విష‌యాన్నే నొక్కివ‌క్కాణిస్తున్నాయ‌ని, క‌చ్చితంగా తండ్రి మ‌ర‌ణానికి ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి హ‌మ్‌జా పెద్ద ప‌న్నాగం పన్నే అవ‌కాశాలున్నాయ‌ని ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్‌, అల్ ఖైదా స్పెష‌లిస్ట్ అలీ సుఫాన్ తెలిపారు. బిన్‌లాడెన్‌కి హ‌మ్‌జా మూడో భార్య ద్వారా జ‌న్మించాడు. అత‌ని 20 మంది సంతానంలో హ‌మ్‌జా 15వ వాడు. మాట‌తీరు, ప్ర‌వ‌ర్త‌న అచ్చం తండ్రిలాగే ఉంటాయి. అత‌ని ఆడియో మెసేజుల్లో కూడా జిహాదీల‌ను ప్రేరేపించ‌డానికి అచ్చం బిన్‌లాడెన్‌లాగే మాట్లాడేందుకు, ప‌దాల‌ను ఉచ్చ‌రించడానికి ప్ర‌య‌త్నిస్తాడు.