: ఇస్లామిక్ దేశాల్లోనే లేదు... ఇక్కడెందుకు?: ట్రిపుల్ తలాక్ పై సుప్రీం న్యాయమూర్తుల్లో విభేదాలు!

ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని, పార్లమెంట్ ఆరు నెలల్లోగా చట్టం చేసే వరకూ తలాక్ చెప్పడాన్ని నిషేధిస్తున్నామని ఈ ఉదయం తీర్పిచ్చిన సుప్రీంకోర్టు, పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వివిధ మతాలకు చెందిన ఐదుగురు న్యాయమూర్తులు కేసును విచారించగా, ముగ్గురు సభ్యులు తలాక్ చెల్లదని స్పష్టం చేయగా, మరో ఇద్దరు మాత్రం వేలాది సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయాలను తేలికగా తొలగించలేమని అన్నారు. ఇక ఎన్నో ఇస్లామిక్ దేశాలు ట్రిపుల్ తలాక్ పై ఎప్పటినుంచో నిషేధాన్ని అమలు చేస్తున్నాయని గుర్తు చేసిన న్యాయమూర్తులు, ఇక్కడెందుకు నిషేధం విధించరాదని తమ తీర్పులో ప్రశ్నించారు.

తలాక్ చెప్పడం కచ్చితంగా చట్ట విరుద్ధమేనని, ఇది మహిళల హక్కులను హరిస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని తాము భావించడం లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. తలాక్ ను నిషేధించాలని జస్టిస్ నారీమన్, జస్టిస్ కురియన్, జస్టిస్ లలిత్ లు అభిప్రాయపడగా, చీఫ్ జస్టిస్ ఖేహార్, జస్టిస్ నాజిర్ లు మాత్రం ఇప్పటికిప్పుడు వద్దని, మరింత వాదన జరగాల్సి వుందని అన్నారు. న్యాయమూర్తుల్లో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో, అత్యధిక న్యాయమూర్తుల అభిప్రాయమైన, తలాక్ చెల్లదని చెబుతూ, ఆ ఆదేశం ఆరు నెలల పాటు అమలయ్యేలా ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తూ, పార్లమెంట్ లో చట్టం చేయాలని కోర్టు సూచించింది.

More Telugu News