: సరిహద్దుల్లో చైనా మరోసారి యుద్ధ విన్యాసాలు!

చైనా సైన్యం (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) మరోసారి భారత సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలు నిర్వహించినట్టు ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ రోజు వెల్లడించింది. ఇరు దేశాల మధ్య డోక్లామ్ విషయమై ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో ఈ యుద్ధ విన్యాసాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల మొదటి వారంలో జరిగిన ఈ విన్యాసాలను ఇతమిద్ధంగా ఎక్కడ నిర్వహించిందీ వెల్లడించలేదు. చైనా సెంట్రల్ టెలివిజన్ కథనాన్ని ఉటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ ఈ వివరాలను బయటపెట్టింది.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ కు చెందిన పదికిపైగా యూనిట్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. భారత్ కు అత్యంత సమీపంలోని కింఘై-టిబెట్ పీఠభూమి వెస్ట్రన్ కమాండ్ కు ప్రధాన కేంద్రంగా ఉంది. యుద్ధ విన్యాసాలు నిర్వహించిన యూనిట్లలో వాయు, సాయుధ విభాగాలు కూడా ఉన్నట్టు గ్లోబల్ టైమ్స్ కథనం ఆధారంగా తెలుస్తోంది. విన్యాసాల్లో భాగంగా యద్ధ ట్యాంకులు లక్ష్యాలపైకి శతఘ్నులను విడిచి పెడుతున్న దృశ్యాలను ఓ ఐదు నిమిషాల నిడివితో కథనాన్ని చైనా సెంట్రల్ టెలివిజన్ ప్రసారం చేసింది. ఇది అక్కడి ప్రభుత్వ అధికార చానల్. ఈ కథనం ఆధారంగా గ్లోబల్ టైమ్స్ కథనాన్ని అల్లింది. కాగా, భారత్, చైనా, టిబెట్ సరిహద్దుల్లోని డోక్లామ్ లో ప్రతిష్టంభన ఏర్పడిన తర్వాత జూలై చివర్లోనూ ఈ తరహా విన్యాసాలు నిర్వహించడం గమనార్హం.

More Telugu News