: చైనీయుల పచ్చటి పొదరిల్లిది... బెస్ట్ డిజైన్స్ లో రెండో బహుమతి కొట్టింది!

వైవిధ్యాన్ని కోరుకునేవారు, సంప్రదాయ పోకడలకు భిన్నంగా వెళ్లేవారు అద్భుతాల రూపకల్పనకు కారకులవుతుంటారు. ప్రపంచంలోని వంద శాతం ఆవిష్కరణలు సంప్రదాయానికి బిన్నంగా పయనించడం కారణంగా సంభవించినవే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా, చైనా రాజధాని బీజింగ్‌ కి చెందిన ‘పెంద’ అనే ఆర్కిటెక్ట్‌ సంస్థ రూపొందించిన సరికొత్త అపార్టుమెంట్ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ అపార్ట్ మెంట్ మోడల్ చైనా డిజైన్ అవార్డుల్లో రెండో స్థానంలో నిలవడంతో 2023 నాటికి 20 వేల మంది ఇలాంటి అపార్ట్ మెంట్ లలో నివసించేలా వీటి నిర్మాణం చేబడుతున్నామని ఆ సంస్థ చెబుతోంది. కేవలం వెదురు బొంగులు, తాళ్ల సాయంతో ఈ అపార్ట్ మెంట్‌ నిర్మించడం విశేషం. ఈ అపార్ట్ మెంట్ రూపకల్పనలో ఎలాంటి పనిముట్లు, యంత్రాలు ఉపయోగించకపోవడం విశేషం. ఎనిమిదేసి వెదురు బొంగులను గుండ్రంగా కట్టి స్తంభంలా రూపొందించారు. ఈ స్తంభంపై సమాంతరంగా వెదురు కర్రలను అమర్చి, వాటిని తాళ్లతో కట్టి ఫ్లోర్‌ లా రూపొందించారు. వీటిపై కుండీలు పెట్టి మొక్కలు పెంచారు. పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా, పచ్చని చెట్ల మధ్య నివసించే అవకాశం కల్పించారు. ఇది పురాతన పధ్ధతి నిర్మాణంలా అనిపించినప్పటికీ, ఇందులో అనుసరించిన సరికొత్త శైలి కారణంగా ఇది నూతనంగా అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇందుకోసం వెదురు చెట్లను భారీ సంఖ్యలో నరకాల్సి రావడంతో వెదురు బొంగును నరికిన ప్రతి చోటా రెండు కొత్త మొక్కలు నాటుతున్నారు. ఇవి చైనీయులను ఆకట్టుకుంటాయని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

More Telugu News