శనివారాల నోము

శనివారాల నోము
శని ... అనే పేరు వినగానే ఎంతటి వారైనా భయపడిపోతారు. ఎలాగో అలా ఆయనను పూజించి, ఆయన కల్పించే చిక్కుల్లోంచి బయటపడిపోవాలని అనుకుంటారు. సాక్షాత్తు ఈశ్వరుడినే తిప్పలు పెట్టిన శనేశ్వరుడు, విక్రమార్క మహారాజును కూడా నానాఅవస్తలు పెట్టాడు. తనకి ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాల పాటు పట్టనున్నదని తెలుసుకున్న విక్రమార్కుడు, శనేశ్వరుడి కోసం తపస్సు చేశాడు.

ఆయన అభ్యర్ధనను మన్నించిన శనేశ్వరుడు, ఏడున్నర సంవత్సరాల కాలం అనే లెక్కను తగ్గించుకుని ఏడున్నర ఘడియల పాటు మాత్రం తన బారిన పడక తప్పదని చెప్పాడు. దాంతో ఆ ఏడున్నర ఘడియలు అడవిలో గడపడం మంచిదని భావించి మారు వేషంలో విక్రమార్క మహారాజు అక్కడికి వెళ్లాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక దొంగ కోసం గాలిస్తోన్న మరో రాజ్యపు రక్షక భటులకు విక్రమార్కుడి దగ్గరలోనే నగలమూట కనిపించింది. దాంతో వాళ్లు విక్రమార్కుడిని తీసుకు వెళ్లి తమ రాజుగారి ముందు ప్రవేశ పెట్టారు.

ఆ రాజు విక్రమార్కుడికి ఉరిశిక్షను అమలు చేయమని ఆదేశించాడు. అప్పటికే ఏడు ఘడియలు కావడంతో, అరఘడియ సేపు ఆగిన తరువాత తనకి ఆ శిక్ష అమలు పరచమని విక్రమార్కుడు ఆ రాజును వేడుకున్నాడు. అతని మాట తీరు ... ప్రవర్తన చూసిన రాజు అందుకు అంగీకరించాడు. సరిగా అరఘడియ దాటగానే అసలు దొంగ దొరికాడంటూ, రక్షక భటులు ఓ వ్యక్తిని అక్కడికి తీసుకువచ్చారు.

దాంతో విక్రమార్కుడు తన వేషం తీసేశాడు. అందరూ ఆశ్చర్య పోతూ ఆయనకి మర్యాద పూర్వకంగా నమస్కరించారు. ముందుగానే ఆ సంగతి చెప్పవచ్చు గదా అని అడిగారు. శని ప్రభావం ఉన్నప్పుడు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదంటూ, తన రాజ్యానికి చేరుకున్నాడు. ఆ రోజు నుంచి ప్రతి శనివారం శనికి - ఈశ్వరుడికి అభిషేకాలు ... పూజలు చేస్తూ చిమ్మిలి నైవేద్యంగా పెట్టాడు. ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ వచ్చాడు. అలా 19 సంవత్సరాలు చేసి ... ఒక మట్టి మూకుడులో నువ్వుల నూనె పోసి దానిని వెలిగించి, నువ్వులు - బెల్లంతో సహా ఒక నల్లని వస్త్రాన్ని బ్రాహ్మణుడికి దానమిచ్చి మహా ఉద్యాపన కార్యక్రమాన్ని పూర్తి చేశాడు.

More Bhakti Articles