ఆదివారాల నోము

ఆదివారాల నోము
ఇది సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ నోచుకునే నోము. భక్తి శ్రద్ధలతో ... నియమ నిష్టలతో ప్రతి ఉదయం సూర్యుడిని ఆరాధించడమే ఈ నోము ప్రధాన ఉద్దేశం. ఈ విధంగా అనునిత్యం సూర్యుడిని కొలుస్తూ, 'రథసప్తమి' రోజున ఆయన బంగారు ప్రతిమను పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ ప్రతిమను బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఇక ఈ నోము పట్టిన వారిని సూర్య భగవానుడు ఏ విధంగా అనుగ్రహిస్తాడనేది ఈ కథ వివరిస్తోంది.

పూర్వం ఓ గ్రామంలో పేదరాలైనా ముసలమ్మ ఉండేది. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఎదురింటి వారి ఆవుపేడ తీసుకు వచ్చి ఇల్లంతా శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టేది. ఆ తరువాత సూర్యుడికి నమస్కరించి, ఆయనకి పాయసాన్ని వైవేద్యంగా పెట్టిన తరువాతనే మిగతా పనులు చూసుకునేది. ఇక ఆదివారం రోజున మాత్రం నివేదన చేసిన పాయసాన్ని తప్ప మరేమీ తినేది కాదు.

ఆమె భక్తి శ్రద్ధల కారణంగా ఆ పూరిల్లు ఎప్పుడూ కళకళలాడుతూ వుండేది. అందుకు కారణం తన ఆవు పేడనే అని భావించిన ఎదురింటావిడ, ఆ ముసలావిడని తన ఇంటికి రాకుండా చేసింది. దాంతో ఆ రోజున పేడ దొరక్క పోవడంతో, ఇల్లు అలక కుండా వంట చేయకుండా ఆ ముసలావిడ పస్తులుండి పోయింది. ఆమె పరిస్థితి చూసి సూర్య భగవానుడి మనసు కరిగిపోయింది. ఆ రాత్రి ఆయనే స్వయంగా ఓ ఆవును తోలుకు వచ్చి ఆమె గుడిసె ముందు కట్టేసి వెళ్లిపోయాడు.

మరునాడు ఉదయం ఆ ఆవును చూసిన ముసలమ్మ ఆనందాశ్చర్యాలకి లోనవుతూ, సూర్యనారాయణ మూర్తికి కృతజ్ఞతలు తెలిపింది. హఠాత్తుగా ఊడిపడిన ఆవును చూసిన ఎదురింటావిడ, ఆ రాత్రి దాని పేడను దొంగిలించింది. ఆ పేడలో బంగారం కలిసి వుండటం చూసి, ఆవునే దొంగిలించడానికి సిద్ధపడింది. ఈ లోగా సూర్య భగవానుడు కలలో కనిపించి హెచ్చరించడంతో, ఆ ముసలమ్మ ఆవును తన గుడిసె లోపల కట్టేసింది. కోపంతో రగిలిపోయిన ఎదురింటామే బంగారపు పేడ వేసే ఆ ఆవును గురించి రాజుగారి దృష్టికి తీసుకు పోయింది.

దాంతో ఆయన భటులను పంపించి ఆవును తన ఆస్థానానికి తెప్పించి పరీక్షించసాగాడు. అప్పుడు పేడ వేయడం మొదలు పెట్టిన ఆవు గంటల తరబడి ... రోజుల తరబడి ఆగకుండా అలా పేడ వేస్తూనే వుంది. చూస్తుండగానే పేడ కుప్పలు గుట్టలు ... గుట్టలుగా పేరుకుపోతూ ఉండటంతో, రాజుకు తాను చేసిన తప్పు అర్ధమైంది. వెంటనే అతను ఆ ముసలమ్మను ... ఆమె ద్వారా సూర్య భగవానుడిని క్షమించమని కోరాడు. ఆవును గురించి ఫిర్యాదు చేసిన స్త్రీని శిక్షించి ... ఆవును పూజించి ముసలమ్మకు అప్పగించాడు.

More Bhakti Articles