సుబ్రహ్మణ్య షష్ఠి

సుబ్రహ్మణ్య షష్ఠి
లోక కల్యాణం కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అవతరణ జరిగింది. తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను గడగడలాడిస్తూ వుండగా, దేవతలంతా బ్రహ్మదేవుని దగ్గర తమ ఆందోళనను వ్యక్తం చేశారు. దాంతో పరమేశ్వరుడి తేజంశ సంభూతుడైన వాడే తారకాసురిని సంహరించగలడని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న దేవతలంతా మన్మధుడిని ఉపయోగించుకుని పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగేలా చేశారు.

శివపార్వతుల ప్రణయం కారణంగా ఉద్భవించిన తేజస్సు అగ్నిహోత్రునికి అందజేయబడింది. దాని తీవ్రతను భరించలేని అగ్నిదేవుడు, ఆ తేజస్సును గంగానదిలో వదిలాడు. ఆ సమయంలో నదిలో స్నానం చేస్తోన్న ఆరుగురు దేవకన్యల గర్భంలో ఆ తేజస్సు ప్రవేశించింది. వాళ్లంతా కూడా ఆ వేడిని తట్టుకోలేక ఒడ్డునే వున్న గడ్డి పొదల్లో ఆ తేజస్సును వదిలారు. ఫలితంగా ఆరుగురు దేవకన్యలు వదిలిన తేజస్సులో నుంచి ఆరుముఖాలు కలిగిన ఓ బాలుడు అక్కడ అవతరించాడు.

పార్వతీ పరమేశ్వరులు ఆ బాలుడికి కుమారస్వామిగా నామకరణం చేసి, కాలక్రమంలో దేవతల సర్వ సైన్యాధిపతిగా నియమించారు. శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చి తారకాసురుడిపై యుద్ధానికి పంపించారు. కుమారస్వామి తన ఆయుధంతో తారకాసురుడిని సంహరించాడు. కుమారస్వామి విజయం సాధించిన ఈ రోజునే ఆయనకి దేవసేనతో వివాహం జరిగింది. ఈ రోజే 'సుబ్రహ్మణ్య షష్ఠి'గా పరిగణించబడింది. ఈ రోజున స్వామివారిని పూజించినట్టయితే సంతానం .. సౌభాగ్యం .. ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని చెబుతూ వుంటారు.

More Bhakti Articles