రథ సప్తమి వ్రతం

రథ సప్తమి వ్రతం
అనారోగ్యాల నుంచి ... దారిద్ర్యం నుంచి విముక్తిని కలిగించేదిగా 'రథ సప్తమి'వ్రతం చెప్పబడుతోంది. ఈ వ్రతం చేసుకునేవారు మాఘ శుద్ధ సప్తమినాడు ఉదయాన్నే తలపై జిల్లేడాకులూ ... రేగిపళ్లు పెట్టుకుని నదిలో స్నానం చేయాలి. ఆ తరువాత సూర్య దేవాలయానికి వెళ్లి ఆయన అనుగ్రహం కోసం అర్చన చేయించాలి.

ఇంకాస్త సమయాన్ని ... ధనాన్ని కేటాయించాలనుకునే వారు ఈ వ్రతాన్ని ఇంటిదగ్గరే చేసుకో వచ్చును. ఇందుకోసం బంగారంతో సూర్యుడి ప్రతిమను ... వెండితో చంద్రుడి ప్రతిమను తయారు చేయించాలి. సూర్యుడి ప్రతిమను బంగారు రంగు వస్త్రంతోను ... చంద్రుడి ప్రతిమను తెల్లని వస్త్రంతోను అలంకరించాలి. శాస్త్రోక్తంగా పూజించిన తరువాత, సూర్యుడికి పాయసాన్ని ... చంద్రుడికి చలిమిడిని నైవేద్యంగా సమర్పించాలి.

ఇక ఈ వ్రతానికి కాంభోజ రాజు ద్వారా ప్రచారం లభించి ... అన్ని ప్రాంతాలకు విస్తరించిందని చెప్పే కథ ఒకటి కనిపిస్తోంది. కాంభోజ రాజుకి నలుగురు కొడుకులు ఉన్నారు. వాళ్లంతా కూడా గురుకుల విద్యను ... యుద్ధ విద్యలను అభ్యసించి తిరిగి తమ నగరానికి చేరుకున్న వారే. వయసు పైబడుతోన్న కారణంగా ఆ రాజు తన కొడుకుల్లో యోగ్యులైన వారికి రాజ్యాధికారాన్ని అప్పగించాలని నిర్ణయించుకున్నాడు.

అయితే కొడుకులంతా కూడా ఒకరి తరువాత ఒకరు తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతూ వచ్చారు. ఎవరూ కూడా త్వరగా కోలుకునే అవకాశం కనిపించకపోవడంతో, రాజుగారు మనస్తాపానికి లోనయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ రాజ్యానికి ఓ మహర్షి వచ్చాడు. ఆయనను రాజుగారు తన ఆస్థానానికి పిలిపించి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. పరిస్థితిని అర్ధం చేసుకున్న ఆ మహర్షి 'రథసప్తమి వ్రతం' చేసుకోమని సలహా ఇచ్చాడు. ఈ వ్రతం కారణంగా ఆరోగ్యంతో పాటు సకల సంపదలు లభిస్తాయని చెప్పాడు. స్త్రీ - పురుషులెవరైనా ఈ వ్రతం ఆచరించుకోవచ్చునంటూ విధి విధానాలను వివరించాడు.

మహర్షి మాటలను రాజుగారు అక్షరాలా ఆచరణలో పెట్టడం వలన, ఆయన కొడుకులంతా అనారోగ్యాల నుంచి పూర్తిగా కోలుకున్నారు. దాంతో వారిలో యోగ్యుడైన కొడుక్కి పట్టాభిషేకం చేసి ఆయన తన బాధ్యతను తీర్చుకున్నాడు.

More Bhakti Articles