పదహారు ఫలాల నోము

పదహారు ఫలాల నోము
'పదహారు ఫలాల నోము' పదహారు రోజులపాటు చేయవలసి వుంటుంది. చక్కని సంతానాన్ని ఆశించి పట్టే ఈ నోములో, ఒక్కోరోజు ఒక్కో ముత్తయిదువుకు ఒక్కో రకానికి చెందిన పండును దక్షిణ తాంబూలాలతో సహా వాయనమిస్తూ పోవాలి. పదహారవ రోజున పదహారవ ముత్తయిదువుకు ఒక పండును వాయన మిచ్చిన తరువాత, ఈ పదహారు రోజులపాటు పంచుతూ వచ్చిన 16 పండ్లను మరో ముత్తయిదువుకు వాయనమిచ్చి ఉద్యాపన చెప్పుకోవాలి.

ఇక ఈ నోమును ఎంత నియమ నిష్టలతో ... ఎంతటి నిస్వార్ధమైన మనసుతో జరుపుకోవాలనే విషయాన్ని ఈ కథ వివరిస్తోంది. పూర్వం ఒక రాజుగారి భార్య ... మంత్రి గారి భార్య ఎంతో స్నేహంగా మసలుకునే వారు. ఇద్దరూ ఒకే ఈడు వాళ్లు కావడంతో, చక్కని సంతానాన్ని ఆశించి పదహారు ఫలాల నోము నోచుకోవాలని అనుకున్నారు. వేరు వేరుగానే అయినప్పటికీ ఇద్దరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యాపన చెప్పుకున్నారు. అయితే రాజుగారి భార్యకు శారీరకంగా ... మానసికంగా లోపాలు గల పిల్లలు కలిగారు. మంత్రి గారి భార్యకు మాత్రం పండంటి బిడ్డలు కలిగారు.

దాంతో తాను చేసిన పొరపాటు ఏమిటంటూ రాణీ గారు కన్నీళ్లు పెట్టుకుంది. ముత్తయిదువులకు తాను మేలు రకానికి చెందిన తాజా పండ్లు వాయనంగా ఇచ్చాననీ, ఆమె మాత్రం నాశిరకానికి చెందినవి ... తినడానికి పనికిరానివి వాయనంగా ఇచ్చిన కారణంగానే ఇలా జరిగి ఉంటుందని మంత్రిగారి భార్య తన మనసులోని మాటను బయట పెట్టింది. అందులో నిజం ఉండటంతో రాణి పశ్చాత్తాప పడింది. వెంటనే మళ్లీ ఈ నోమును పట్టి ... ఈ సారి ఎటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంది. ఆ తరువాత రాణి గారికి కూడా పండంటి బిడ్డలు కలిగి ఆమె జీవితాన్ని ఆనందమయం చేశారు.

More Bhakti Articles