కళ్లాపి - ముగ్గులు

కళ్లాపి - ముగ్గులు
ప్రతి నిత్యం ఉదయాన్నే వాకిలి ఊడ్చి ఆవుపేడ నీళ్లతో కళ్లాపి జల్లి ముగ్గులు వేయడం అనాదిగా వస్తోన్న ఆచారం. వాకిలిలో కళ్లాపి జల్లి ముగ్గుపెట్టడమంటే, లక్ష్మీదేవిని ఆహ్వానించడమేనని పెద్దలు చెబుతారు. ఈ కారణంగానే నేటికీ ఈ ఆచారం కొనసాగుతోంది.

ఒకప్పుడు పండుగలు ... పర్వదినాల సమయాల్లో ఇల్లంతా మట్టి - పేడ కలిపి అలికి ప్రత్యేకమైన ముగ్గులు పెట్టేవారు. అంతే కాకుండా ప్రతి శుక్రవారం పొయ్యిని కూడా పేడతో కలిపిన మట్టితో మెత్తి, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తరువాతనే దానిపై వంటచేసే వారు. ఏ ఇల్లు అందంగా అలికి ముగ్గులు పెట్టబడి ఉంటుందో, ఆ ఇంట్లోకి లక్ష్మీ దేవి రావడానికి ఇష్టపడుతుందని విశ్వసించడమే ఇందుకు కారణం.

ఇక వివాహం ... ఉపనయనం ... సమయాల్లో పీటకిందా, నోములు ... వ్రతాల సమయాల్లో పీట పైనా ముగ్గు వేస్తుంటారు. యజ్ఞ యాగాదులు నిర్వహించేటప్పుడు ఆ వేదికలపైన ముగ్గులు పెడుతుంటారు. ఇక సంక్రాంతి వంటి పండుగల సందర్భాల్లో రంగురంగుల ముగ్గులు నయనానందకరంగా కనిపిస్తుంటాయి. ఈ పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు పెట్టి బహుమతులు ఇవ్వడం కూడా ఆయా ప్రాంతాల్లో జరుగుతూ వుంటుంది.

ఇక కొత్తగా వచ్చిన కోడళ్లు మొట్ట మొదటిసారిగా మంచి పేరు తెచ్చుకునేది ముగ్గులు పెట్టడంతోనే. అందువలన కన్నె పిల్లలంతా ముగ్గులు పెట్టడంలో నైపుణ్యం సంపాదించడానికి ఎంతో ఆసక్తిని కనబరుస్తుంటారు. ప్రాచీన కాలం నుంచి వస్తోన్న ఈ ఆచారం వెనుక అసలైన అర్థమే దాగివుంది.

పేడనీళ్ళు చల్లడం వలన క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా వుంటాయి. ఇక ఈ వాసన స్త్రీలకు శ్వాస సంబంధమైన వ్యాధులు రాకుండా కాపాడటమే కాకుండా, టి.బి.వంటి వ్యాధుల బారిన పడకుండా నిరోధిస్తుంది. ఇక ముగ్గుల మధ్య దిద్దే రంగులు చూడటం వలన కళ్లకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయని రుజువైంది. మన పరిసరాలు శుభ్రంగా ఉంచుతూ, చీమల వంటి అల్ప జీవులకు ఆహారాన్ని అందించడం వలన పుణ్యం లభిస్తుందనే ఉద్దేశంతోనే బియ్యపు పిండితో ముగ్గులు పెడుతుంటారు.

More Bhakti Articles