జపం - శ్రద్ధ

జపం - శ్రద్ధ
ఆధ్యాత్మిక జీవన విధానంలో 'జపమాల'కి ఒక ప్రత్యేక స్థానముంది. పూజా మంటపం దగ్గర ... దేవాలయాల్లోనూ కూర్చుని కళ్లుమూసుకుని జపాలు చేసే వాళ్లని మనం చూస్తూనే వుంటాం. వీళ్లంతా 108 పూసలుగల తులసి మాలతో గానీ ... రుద్రాక్షమాలతో గాని జపం చేస్తూ వుంటారు. తాము అనుకున్న సంఖ్య పూర్తయ్యేదాక ఒకే మంత్రాన్ని మనసులోనే జపిస్తుంటారు.

కొంతమంది ప్రదక్షిణలు చేయడానికి కూడా జపమాల వాడుతూ ఉంటారు. అసలు దేవుడికి మనకి మధ్య లెక్కలేంటి? ఒకసారి తక్కువ జపించడం వలన వచ్చే నష్టం ఏముంటుందని చాలామంది అనుకుంటూ వుంటారు. మరికొందరేమో జపం చేస్తూనే మధ్య మధ్యలో నలుగురితో సరదాగా మాటలు కలుపుతుంటారు. నిజానికి జపమాల అనేది కేవలం దేవుడి యొక్క నామాన్ని ఎన్నిసార్లు స్మరించామనే విషయాన్ని సంఖ్యాపరంగా గుర్తుచేయడానికే కాదు ... ఆ మంత్రం మనసులో బలంగా నాటుకోవడం కోసం వాడటం జరుగుతూ వుంటుంది.

ఏకాగ్రతతో కూడిన మనసుతో దైవనామస్మరణ చేయాలి ... ఆ సమయంలో జప సంఖ్యపైకి దృష్టి పోకూడదనే ఉద్దేశంతోనే, జపమాలను వాడుతూ ఉంటారు. అలాంటిది జపం చేస్తూ ఇతర విషయాలపట్ల దృష్టి పెట్టడం ... మధ్యమధ్యలో మాట్లాడటం అసలు చేయకూడదు. అలాగే చిన్నచిన్న పనులు చేసుకుని వచ్చి మళ్లీ జపస్థానంలో కూర్చుని దానిని కొనసాగించకూడదు. జపం చేసేటప్పుడు ప్రశాంతత ... ఏకాగ్రత ... భక్తి శ్రద్ధలు ఎంతో అవసరం. ఈ నియమ నిష్టలేవీ లేకుండా చేసేది మొక్కుబడి జపమే అవుతుంది గానీ ... మొక్కులను తీర్చే జపం మాత్రం కాలేదు.

More Bhakti Articles