భగవంతుడు మంచి మాత్రమే చేస్తాడు

భగవంతుడు మంచి మాత్రమే చేస్తాడు
ఏది జరిగినా మనమంచికే అనే మాట వివిధ సందర్భాల్లో వినిపిస్తూ వుంటుంది. అంటే భగవంతుడు మనకి మంచి మాత్రమే చేస్తాడనే అర్థం, ఈ మాటలో ధ్వనిస్తూ వుంటుంది. సాధారణంగా ఎవరు ఎంతటి సమర్థులైనా ... ప్రతిభావంతులైనా, తాము చేస్తోన్న పనికి దైవం సాయాన్ని ఆశిస్తూ వుంటారు. భగవంతుడి చేయూతతోనే ఏ కార్యాన్నయినా సాధించగలుగుతామని విశ్వసిస్తూ వుంటారు.

ఆ నమ్మకంతోనే విద్య ... వివాహం ... ఉద్యోగం ... గృహ నిర్మాణం వంటి వివిధ కార్యాలను ఆరంభిస్తూ వుంటారు. తాము తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తికావాలని కోరుకుంటారు. అయితే ఒక్కోసారి ఆదిలోనే ఈ కార్యాలకు ఆటంకం ఏర్పడుతూ వుంటుంది. ఎంతగా ముందుకు తీసుకువెళదామని ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. దాంతో ఆ కార్యాన్ని ఆరంభించిన వాళ్లు దిగాలు పడిపోతుంటారు. భగవంతుడు కనికరించలేదనీ, కాలం కలిసిరాలేదని అసహనాన్ని వ్యక్తం చేస్తుంటారు.

అలా కొంతకాలం గడిచిన తరువాత కొన్ని రకాల పరిస్థితులు వాళ్లకి ఎదురవుతాయి. తాము తలపెట్టిన కార్యం ఆదిలోనే ఆగిపోవడం మంచిదైందనే విషయం అనుభవంలోకి వస్తుంది. అనుకున్న ప్రకారం ఆ కార్యం సజావుగా సాగివుంటే, మరికొంత సమయాన్నీ ... ధనాన్ని ... విలువైన జీవితాన్ని కోల్పోవలసి వచ్చేదని తెలుసుకుంటారు. అనవసరంగా భగవంతుడిని నిందించామనీ ... తమకి ఆయన మంచే చేశాడంటూ కృతజ్ఞతలు తెలియజేస్తారు.

తనని విశ్వసించిన వారిని ఏ సమయంలో ఎలా ఆదుకోవాలో భగవంతుడికి బాగా తెలుసు. అందుకే ఆయన కొన్ని అడ్డంకులని సృష్టిస్తూ వుంటాడు. ఇదే విషయం మనకి శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం విషయంలోను స్పష్టమవుతూ వుంటుంది. అయోధ్యలో శ్రీరాముడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతూ వుండగా, చకచకా పరిస్థితులు మారిపోతాయి. సింహాసనాన్ని అధిష్ఠించవలసిన రాముడు, రాజ్యభోగాలకు దూరంగా వనవాసానికి బయలుదేరవలసి వస్తుంది.

ఊహించని ఈ సంఘటనకు అయోధ్య పురవాసులంతా నివ్వెరపోతారు. పరమానందంగా జరగవలసిన పట్టాభిషేక మహోత్సవం ఆగిపోవడం, సీతారాములు వనవాసానికి బయలుదేరడం వాళ్లకి ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆ తరువాత లోక కంటకుడైన రావణుడిని రాముడు సంహరించడాని వాళ్లకి తెలుస్తుంది. రాముడు వనవాసానికి వెళ్లవలసి రావడం వెనుక లోక కల్యాణం దాగి ఉందనే విషయం అప్పుడు వాళ్లకి అర్థమవుతుంది. వనవాసానికే రాముడు ఎందుకు మొగ్గుచూపాడో బోధపడుతుంది. అందుకే తలపెట్టిన కార్యాలకు ఒక్కోసారి ఆటంకం కలిగినా డీలా పడిపోకూడదు. అందులో ఏదో ఆంతర్యం దాగివుందని భావించి, భగవంతుడి అనుగ్రహం కోసం వేచివుండాలి.

More Bhakti Articles