ఇక్కడ కోడె మొక్కులు ఇందుకే చెల్లిస్తారు

ఇక్కడ కోడె మొక్కులు ఇందుకే చెల్లిస్తారు
కోడె మొక్కులు చెల్లించబడే క్షేత్రం అనగానే అందరికీ వేములవాడ రాజరాజేశ్వరుడి క్షేత్రం గుర్తుకు వస్తుంది. కరీంనగర్ జిల్లా పరిధిలో ఆవిర్భవించిన ఈ క్షేత్రంలో, శివరాత్రి వచ్చిందంటే చాలు ... భక్తులు వెంటతీసుకొచ్చిన కోడెలతో ఆ ప్రాంతమంతా సందడిగా కనిపిస్తుంది. భక్తులంతా ఈ కోడెలను రాజరాజేశ్వరుడికి మొక్కుబడిగా చెల్లిస్తుంటారు. అంటే స్వామివారికి వాటిని అప్పగించి వెళుతుంటారు.

తరతరాలుగా ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది. సాధారణంగా ఇటువంటి ఆచారాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటాయి. అయితే అందరూ ఆచరించేదే ఆచారం కనుక, దాని వెనుక ఏదో బలమైన విశ్వాసం దాగి ఉంటుందనే విషయం అర్థమవుతుంది. అలాంటి విశ్వాసం మనకి ఇక్కడి రాజరాజేశ్వరుడి క్షేత్రంలో కనిపిస్తుంది.

రాజరాజేశ్వరుడికి కోడెను సమర్పించుకుంటే, తప్పనిసరిగా సంతానం కలుగుతుందని భక్తులు భావిస్తుంటారు. సంతానం కలిగితే శివరాత్రికి కోడెను ఇచ్చుకుంటామని స్వామివారికి మొక్కుకుంటారు. స్వామి అనుగ్రహంతో తమ కోరిక నెరవేరగానే, తమ సంతానంతో ఈ క్షేత్రదర్శనం చేసుకుంటారు. భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా ఆ బిడ్డను స్వామికి చూపించి ఆయన ఆశీస్సులు కోరతారు.

బిడ్డను ... కోడె దూడను కలిపి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. అనుకున్న ప్రకారం కోడెను స్వామివారికి వదిలి, మొక్కుబడి చెల్లిస్తున్నట్టుగా స్వామివారికి మనసులో చెప్పుకుని తిరుగు ప్రయాణమవుతారు. సాధారణ భక్తులతో పాటు సంతానాన్ని ఆశించి వచ్చే వాళ్లతో ... మొక్కు చెల్లించుకోవడానికి వచ్చిన వాళ్లతో ఈ క్షేత్రం మహాశివరాత్రి రోజున మహా సందడిగా కనిపిస్తూ వుంటుంది.

More Bhakti Articles